అమత నగర్‌లో మౌలిక వసతులు కల్పించాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌
ప్రొద్దుటూరులో ఉన్న అమత నగర్‌లో 15 ఏళ్ల కిందట పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని, అక్కడ మౌలిక వసతులను కల్పించడంలో పాలక ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు విఫలం చెందారని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ప్రొద్దుటూరు అమతనగర్‌ కాలనీవాసులతో కలసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అమత నగర్‌ స్థలాలకు మౌలిక వసతులు కల్పించాలని, స్థలాలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి సిపిఎం ఆధ్వర్యంలో మూడవ రోజు రిలే దీక్షలు చేస్తున్న ప్రొద్దుటూరు అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోలేదని చెప్పారు. అందుకే కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారని తెలిపారు. 2008లో రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థలాలు ఇచ్చారని, 2018లో 600 మంది పేదలకు స్థలాలుఇచ్చారు కానీ అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమైనారని వాపోయారు. లక్షలు ఖర్చుపెట్టి బేస్‌ మట్టాలు వేసుకున్నారని, కొందరు ఇళ్లు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. పెట్టిన రెండు లక్షలు ఖర్చు వధాగా ఏటిలో వేసినట్టు పోయిందని చెప్పారు. వీరంతా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అన్ని వార్డులలో నివాసం ఉన్నారని చెప్పారు. అమతనగర్‌లో దాదాపుగా 2,300 మంది ఉన్నారని, స్థలాలు ఇచ్చి విద్యుత్‌, మంచినీళ్లు, రోడ్లు, హౌసింగ్‌ రుణాలు ఇవ్వడంలో ఆ పేదలను పట్టించుకోవడంలేదన్నారు. పేదవారికి మౌలిక వసతులు కల్పించకుండా చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. పేదలు వేసుకున్న బేసి మట్టాల జోలికి వస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అక్కడ కొందరు రాజముద్ర కలిగిన సీలు తయారు చేసుకుని దొంగ పట్టాలు తయారు చేస్తూ టీములుగా ఏర్పడి పేదవారిని బెదిరిస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారని చెప్పారు. అటువంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలన్నారు. ధర్నా అనంతరం గ్రీవెన్స్‌లో ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ను కలిసి అమత నగర్‌ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ చారి, శివకుమార్‌, మనోహర్‌, దస్తగిరి రెడ్డి తోపాటు అమత నగర్‌ కాలనీవాసులు వెంకటేష్‌, ప్రభాకర్‌, సుబ్బరాయుడు, పెంచల్‌ రెడ్డి, హసీనా, షాబిరా భాను, లతా పాల్గొన్నారు.

➡️