ఆకతి వస్త్ర దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

ప్రజాశక్తి – ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌)
ప్రొద్దుటూరులోని ఆకతి దుస్తుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా కొర్రపాడు రోడ్డులోని ఆకతి షాపింగ్‌ మాల్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు రూ. 6.80 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు దుకాణ యజమాని హరికృష్ణ పేర్కొన్నారు. వివరాలు.. దుకాణం మూడంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు రెండున్నర గంటలకు పైగా అగ్నిమాపక అధికారులు సిబ్బంది శ్రమించి షాపింగ్‌ మాల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫైర్‌ ఇంజన్లను మంటలు ఆర్పేందుకు జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి రఘునాథ్‌ ఆధ్వర్యంలో తీసుకొచ్చారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్‌ సిబ్బంది లీడింగ్‌ ఫైర్‌ మాన్‌ సాంబశివారెడ్డి పొగ దాటికి స్పహ తప్పి పడిపోయారు. వెంటనే ఆ సిబ్బంది అప్రమత్తమై హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్‌, రూ. 1.20 కోట్ల ఫర్నీచర్‌, ముందు భాగాన ఉన్న గ్లాసుల సుమారు రూ. 3.40 కోట్ల నష్టం వాటిల్లిందని దుకాణం యజమాని తెలిపారు.

➡️