పేదల పాలిట సంజీవని ‘ఆరోగ్యశ్రీ’ : కలెక్టర్‌

ప్రజాశక్తి – కడప రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రధాన్యతో అమలు చేస్తున్న డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం సేవలు పేదల పాలిట సంజీవనిగా ఉపయోగపడుతున్నాయని కలెక్టర్‌ వి.విజరు రామరాజు ప్రశంసించారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానం ద్వారా ఆరోగ్యశ్రీ మెగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌ విసి హాలు నుంచి కలెక్టర్‌ వి.విజరు రామరాజు తోపాటు ఎమ్మెల్సీ రామచంద్రా రెడ్డి, మైదుకూరు, బద్వేలు ఎమ్మెల్యేలు ఎస్‌. రఘురామిరెడ్డి, డాక్టర్‌ డి.సుధా, రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్‌ కమిషన్‌ మెంబర్‌ హిదాయతుల్లా, మైనరిటీస్‌ వెల్ఫేర్‌ ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ బాగ్దాదీ, జెసి గణేష్‌ కుమార్‌, ఎఎస్‌పి తుషార్‌ డూడీ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ హాజరయ్యారు. విసి అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ వి.విజరు రామరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్య ప్రజల జీవితాలకు మరింత భరోసా కల్పించిందన్నారు. అనారోగ్యం బారిన పడ్డవారికి, వారి వైద్యానికి అయ్యే ఖర్చును భరించడమే కాకుండా, వారు పూర్తిగా కోలుకొనే వరకూ ఆరోగ్య ఆసరా నిస్తూ, దేశంలోని ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆరోగ్య ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.5 లక్షల వరకు ఉన్న వ్యయ పరిమితిని ఇక నుండి రూ.25 లక్షల వరకు పెంచిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాలో 7.76 లక్షల మంది ఆరోగ్యశ్రీ కార్డుదారులకు మేలు చేకూరనుందన్నారు. ఈ నాలుగున్నర ఏళ్లలో జిల్లాలో 2,64,346 చికిత్సలు/తెరపీలకు గాను ఇప్పటి వరకు కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తత స్థాయిలో ప్రచారం చేసేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు.. గ్రామస్థాయిలో సచివాలయ వలంటీర్లు, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీ నూతన విధివిధానాలని తెలియజేస్తూ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయనున్నారన్నారు. ఏదైనా కారణాలతో పేదలు అనారోగ్యానికి గురైత . ఆ కుటుంబానికి కొంత ఆర్ధికంగా కూడా ప్రభుత్వం ఆసరాగా కల్పిస్తుండడం గొప్ప విషయం అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ రోగి పూర్తిగా కోలుకొనే వరకూ ‘వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ఆసరా’ పథకం ద్వారా రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ.5వేలు వరకూ ప్రభుత్వమే చెల్లించి ,ఆ రోగిని, కుటుంబాన్ని ఆదుకుకోవడం నిజంగా గొప్పవిషయం అన్నారు. కిడ్నీ డయాలసిస్‌, తలసేమియా తదితర దీర్ఘకాలిక రోగులకు నెలకు రూ.10 వేల వరకూ పింఛన్‌ అందిస్తూ. వారి కుటుంబాలకు ఆరోగ్య ఆసరాతో పాటు ఆర్థిక బాసట కూడా కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ ప్రత్యూష, జడ్‌పి సిఇఒ సుధాకర్‌ రెడ్డి, సిసిఒ వెంకట్రావు, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగరాజు, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ బాలాంజనేయులు, రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమాదేవి, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ హిమదేవి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️