బిజెపి ధమనకాండ నశించాలి

ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు, కార్మిక సంఘాల నాయకుల నిరసన
ప్రజాశక్తి – కడప అర్బన్‌
రైతుల పట్ల నరేంద్రమోడీ ప్రభుత్వం నిరంకుశత్వం, కర్కషంగా వ్యవహరిస్తోందని, ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని ఎపి రైతు, కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. రైతు ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వాన్ని నిరసిస్తూ రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు, కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శులు నాగ సుబ్బారెడ్డి, మనోహర్‌, దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా గతంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బిజెపి ప్రభుత్వం విఫలం చెందిందని పేర్కొన్నారు. అందుకు నిరసనగా రెండో విడత ఢిల్లీ రైతాంగం శాంతియుతంగా ఢిల్లీకి పోతుంటే బిజెపి ప్రభుత్వం రైతుల పట్ల కాల్పులు జరిపి పోలీసులచే దాడి చేయించి రైతు శుభ్‌ కరణ్‌ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం బలితీసుకుందన్నారు. రైతు ఉద్యమం పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని వారు తీవ్రంగా ఖండించారు. గత రైతు ఉద్యమ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాత పూర్వకంగా రైతాంగానికి ఇచ్చిన హమీలను అమలు చేయాలని, ముఖ్యంగా రైతులు పండించే అన్ని పంటలకు డాక్టర్‌.ఎం.ఎస్‌.స్వామినాథన్‌ సిఫార్సుల మేరకు మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్దత కల్పించాలని, ఒక పర్యాయం పంటరుణాలను మాఫీ చేసి ఆత్మహత్యల నుంచి రైతాంగాన్ని కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లో పెట్టిన విద్యుత్‌ బిల్లు 2020ను ఉపసహరించుకోవాలని, గత రైతు ఉద్యమ సందర్భంగా మరణించిన అమరవీరుల కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలని తెలిపారు. రైతు ఉద్యమంలో రైతునాయకులపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు. రైతాంగం ఢిల్లీకి వచ్చి శాంతియుతంగా నిర్వహిస్తున్న ప్రదర్శనపై కానూరి సరిహద్దులో హర్యానా పోలీసులు సాగించిన దుర్మార్గమైన దాడిలో 24 సంవత్సరాల శుభ్‌ కరణ్‌ సింగ్‌ అనే రైతు ఉద్యమకారుడు తీవ్రమైన గాయాలపాలై మతి చెందాడని తెలిపారు. రైతు ఉద్యమం పట్ల బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గమైన వైఖరికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. యువ రైతు మతికి కారణమైన పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టి అన్నదాతలను ఆత్మహత్యలు చేసుకునే విధంగా బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌ బహుళ జాతి కంపెనీలకు దాసోహం అయిందని తెలిపారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని చర్చలు జరిపి రైతాంగం ఆందోళనను విరమించే విధంగా కషి చేయాలని కోరారు. నిరసన కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్‌ శివారెడ్డి, రైతు, కార్మిక సంఘాల జిల్లా నాయకులు శ్రీనివాస్‌ రెడ్డి, బాదుల్లా, మదిలేటి, మనోహర్‌ రెడ్డి, శంకర్‌ రెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి, చంద్ర రెడ్డి పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్‌ : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజరు డిమాండ్‌ చేశారు. గురువారం ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆర్‌డిఒ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వినరుకుమార్‌, నరేంద్ర, దస్తగిరి, మున్నా, రమేష్‌ పాల్గొన్నారు. ఎర్రగుంట్ల : సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు సంఘాల సమన్వయ సమితి, కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎంవి సుబ్బారెడ్డి, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు ఇల్లూరు కష్ణారెడ్డి పాల్గొని నిరసన తెలిపారు.

➡️