బుజ్జగింపులు..సంప్రదింపులు

పోటాపోటీ ఎత్తుగడల్లో వైసిపి,
టిడిపి28న సతీష్‌రెడ్డి కార్యకర్తల సమావేశం
మాజీ ఎమ్మెల్యేలు ద్వారక, రమేష్‌రెడ్డి వైఖరులపై సర్వత్రా చర్చ
ప్రజాశక్తి – కడప ప్రతినిధిజిల్లాలో బుజ్జగింపుల పర్వం పతాక స్థాయికి చేరుకుంది. రెండ్రోజుల కిందటి నుంచి అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి తనదైన శైలిలో బుజ్జగింపులు, సంప్రదింపులు, చేరికలకు తెరలేపాయి. ప్రధాన నాయకులు మొదలు ద్వితీయశ్రేణి నాయకుల వరకు ఎవరినీ మినహాయించడం లేదు. రెండు నెలల కిందట కడప టిడిపి ఇన్‌ఛార్జి మాధవీరెడ్డి కడప మైనార్టీ నాయకలు అమీర్‌బాబును టిడిపి జాతీయ నాయకులు చంద్రబాబు దగ్గరికి పిలిపించుకుని బుజ్జగింపులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల కిందట వేంపల్లికి చెందిన శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎస్‌.వి.సతీష్‌రెడ్డితో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకులు సంప్రదింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఈ నెల 28న కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి బద్వేల్‌లో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి కుటుంబీకుల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి చొరవ తీసుకోవడం, తాజాగా జమ్మలమడుగు నియోజకవర్గానికి సంప్రదింపులను, బుజ్జ గింపులను విస్తరించడం గమనార్హం. సోమవారం రాత్రి జమ్మలమడుగు, మైలవరం మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆయా మండలాలకు చెందిన బిజెపికి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రధాన అనుచరులుగా ముద్ర పడిన నాయకులను వైసిపిలో చేర్చుకునే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు సాగుతుండడం గమనార్హం. అదే జరిగితే పొత్తు ధర్మమనే పేరుతో జమ్మలమడుగు టికెట్‌ను ఆశిస్తున్న బిజెపికి చేరికల అంశం శరాఘాతంగా మారనుంది. టిఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు సుధీర్‌రెడ్డి ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సమక్షంలో వైసిపి తీర్థం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ టిడిపి టికెట్‌ రేసులో చివరి వరకు నిలిచిన మాజీ ఎమ్మెల్యేలు గడికోట ద్వారకనాధరెడ్డి, ఆర్‌.రమేష్‌రెడ్డి ఎటువంటి వైఖరి తీసుకుంటారోననే ఆసక్తి నెలకొంది. ఏదేమైనా ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయ సమీకరణలు ఊహించని వేగాన్ని సంతరించుకోవడంతో రాజకీయం రసవత్తరంగా సాగుతోందని చెప్పవచ్చు.

➡️