లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ]
మతోన్మాదులు నుంచి భారత దేశాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుందామని విద్యార్థి, యువజన, రైతు, కార్మిక ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. శనివారం భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌ వర్ధంతి సందర్భంగా కడప పాత బస్టాండ్‌ జిల్లా కార్యాలయంలో మతవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాలశివకుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గండి సునీల్‌ కుమార్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనురు శ్రీనివాసుల రెడ్డి, రౖతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ 1907వ సంవత్సరం లయల్పూర్‌ జిల్లాలో భంగా గ్రామంలో జన్మించిన భగత్‌ సింగ్‌ చిన్నప్పటినుంచే గద్దర్‌ వీరులు, స్వాతంత్ర పోరాట యోధుల ఉద్యమాలకు ఆకర్షితులై చదువుకునే రోజుల నుంచే స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్నారని తెలిపారు. ముఖ్యంగా బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి విద్యార్థుల్ని యువకుల్ని పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించారని తెలిపారు. వారి స్వార్థం కోసం కాకుండా ఈ దేశం కోసం అతి చిన్న వయసులోనే నవ్వుతూ ఉరి కంభం ఎక్కిన విప్లవ వీరులు అని కొనియాడారు. అప్పట్లో భారత దేశంలో బ్రిటిష్‌ ప్రభుత్వం మతం మధ్య చిచ్చు పెట్టి పబ్బం కడుపుకోవాలని చూస్తే భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు సుఖదేవ్‌, అల్లూరి చంద్రశేఖర్‌ ఆజాద్‌ లాంటి వాళ్లు కుల మతాలకతీతంగా భారతీయులందరినీ ఏకం చేసి పోరాటాల్లోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. 1931 మార్చ్‌ 23న నవ్వుతూ వురి కంభం ఎక్కిన భగత్‌ సింగ్‌ రాజ్‌ గురు సుఖదేవుల స్ఫూర్తితో తండోపతండాలుగా యువకులు స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం వల్లే స్వతంత్రం సిద్ధించిందని చెప్పారు. ప్రస్తుతం సామ్రాజ వాద శక్తులు భారతదేశంలో చొరబడి ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నాయని అన్నారు. ప్రజలను మతం మత్తులో నింపి బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. నేడు దేశంలో నిరుద్యోగాన్ని పేదరికాన్ని పెంచారన్నారు. ప్రజలు తిరుగుబాటు చేయకుండా యువతి, యువకులందరినీ కూడా మతం మత్తులో ముంచేత్తుతున్నారని ఆరోపించారు. దేశ సంపదనంతా బడా కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెడుతున్నారని తెలిపారు. దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగాన్ని పేదరికాన్ని పెంచి పోషించారని ఆరోపించారు. ప్రజల పైన ధరల భారం, అనేక నిర్బంధాలు పెరిగిపోయి ప్రజలు ఆర్థికంగా చితికిపోయారని తెలిపారు. కాబట్టి భారతదేశం నుంచి మతోన్మాదులను తరిమి కొట్టాలని లౌకిక ప్రజాస్వామ్య వామపక్ష శక్తులను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విభజన హామీలైన కడప ఉక్కు సాధన కోసం విద్యార్థులు, యువత, కార్మిక, కర్షక,రైతులు ప్రజలు అందరూ పోరాటాలలో భాగస్వామ్యం కావాలన్నారు. హామీలు నెరవేర్చని బిజెపిని ఎండగడదమని పేర్కొన్నారు. రాబోవు ఎన్నికల్లో వైసిపి, టిడిపి, జనసేనలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రారెడ్డి, సుబ్బయ్య, డివైఎఫ్‌ఐ నగర అధ్యక్షులు షేక్‌.షాకీర్‌, నగర ఉపాధ్యక్షులు విజరు పాల్గొన్నారు.

➡️