సుందరయ్య నగర్‌లో సమస్యలను పరిష్కరించాలి

– సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌
ప్రజాశక్తి – మైదుకూరు
మున్సిపల్‌ పరిధిలోని 22వ వార్డులో సుందరయ్య నగర్‌ వాసుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో సుందరయ్యనగర్‌ వాసులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ఏడేళ్లుగా దాదాపు 150 కుటుంబాల ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ పేదలు జీవనం సాగిస్తున్నారని కాలనీలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవటంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. పేదలు నివాసం ఉన్న చోట వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని పేర్కొన్నారు. ఇంటింటికీ తిరిగిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు సుందరయ్య నగర్‌లో ఇళ్లు కన్పించకపోవడం శోచనీయమన్నారు. మున్సిపాలిటీ నడిబొడ్డులో ఉన్న కాలనీలో వీధి దీపాలు, రోడ్లు లేవని, కాలనీ వాసులే మట్టిరోడ్లు ఏర్పాటు చేసుకున్నారని వారు తెలిపారు. ఇళ్లకు డోర్‌ నంబర్లు, విద్యుత్‌ మీటర్లు, ఏర్పాటుచేయాలని, టికెటి పట్టాలు మంజురు చేసి పక్కా భవనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శివకుమార్‌, జిల్లా కమిటీ సభ్యులు వి.అన్వేష్‌ సిపిఎం మండల కార్యదర్శి షరీఫ్‌, మండల కమిటీ సభ్యులు గురయ్య, బిబి, నాయకులు రవి, సుధాకర్‌, ఇమాం, గంగమ్మ, బాలరాజు, సుబ్బమ్మ, వెంకటేష్‌ పాల్గొన్నారు.

➡️