అంగన్వాడిలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Dec 13,2023 14:54 #Kadapa
అంగన్వాడిలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

ప్రజాశక్తి – వేంపల్లె : అంగన్వాడీ కార్యకర్తలకు సిఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు అనుబంధ సంఘమైన అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మీ దేవి డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సమ్మెలో భాగంగా రెండవ రోజైన బుధవారం వేంపల్లె ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట సిఐటియు, ఏఐటియుసి అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు బైఠాయించి నిరవధిక సమ్మె చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కన్నా అదనంగా రూ 1000 వేతనం ఇస్తామని జగన్‌మోహన్‌రెడ్డి రెడ్డి హమీ ఇచ్చారని మాటలు ఏమైనాయని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని తక్షణమే అమలు చేయాలన్నారు. అలాగే మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. ఐసిడిఎస్ కు బడ్జెట్ కేటాయింపులు చేసి నిధులు పెంచి, ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలని చెప్పారు. అర్హులైన హెల్పర్స్ కు ప్రమోషనుల నిబంధనలను రూపొందించి, ప్రమోషన్ల వయస్సు 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 2017 టిఏ, డిఏతో పాటు ఇతర బకాయిల బిల్లులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో చక్రాయపేట సిఐటియు యూనియన్ నాయకురాలు లలితామ్మ, సావిత్రి, లక్ష్మి, ఎఐటియుసి నాయకురాలు శైలాజ, సరస్వతి, ప్రభావతి, భాగ్యలక్ష్మి, శాంతకుమారి, శ్యామల, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️