ఒంటిమిట్టకు బ్రహ్మోత్సవ శోభనేడు

అంకురార్పణ, రేపు ధ్వజారోహణం
22న సీతారాముల కల్యాణం
ప్రజాశక్తి – ఒంటిమిట్ట
ఒంటిమిట్టకు బ్రహ్మోత్సవ శోభ వచ్చింది. నేటి నుంచి మొదలయ్యే కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు, పనులు పూర్తయ్యాయి. ఆలయప్రాంగణం, ఆలయాన్ని దీపాలతో అలంకరించారు. శ్రీరామనవమిపై ప్రచారం కల్పించేందుకు భారీ ప్లెక్సీలు, గోడపత్రాలు అంటించారు. హరిత శోభకోసం ప్రత్యేకంగా మొక్కలను తెప్పించారు. కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్‌ 22వ తేదీన జరుగనున్న సీతారాముల కల్యాణ ఘట్టానికి యుద్ధప్రాతిపదికన కల్యాణ వేదికను ముస్తాబు చేస్తున్నారు. కోదండరామస్వామి వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. బుధవారం నుంచి తొమ్మిది రోజులపాటు బ్రహోత్సవాల నిర్వహణకు టిటిడి యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఉదయం 4 నుంచి 6 గంటల వరకు వ్యాసాభిషేకం (మూలవర్లకు అభిషేకం), 7.30 నుంచి 11 గంటల వరకు సర్వదర్శనం, 10 గంటలకు శ్రీరామనవమి ఆస్థానం, స్నపన తిరుమంజనం ఉంటుంది. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.రేపు ధ్వజారోహణం ఈ నెల 17న ఉదయం 10.30 నుంచి 11 గంటలకు మిథునలగంలో ధ్వజారోహణం ఉంటుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శేష వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు దర్శనమిస్తారు.22న శ్రీ సీతారాముల కల్యాణం ఏప్రిల్‌ 22వ తేదీన రాత్రి 6.30 నుంచి 8.30 గంటల వరకు సీతారాముల కల్యాణం వేడుకగా నిర్వహిస్తారు. ప్రజలు రూ.750 చెల్లించి కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, రవికె, లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. నేడు, రేపు కవి సమ్మేళనంశ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, శ్రీపోతన జయంతిని పురస్కరించుకుని టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో 17వ తేదీ ప్రముఖ పండితులు శంకర్‌ భాగవతం ప్రాశస్త్యం, ఎం.నారాయణరెడ్డి గజేంద్రుని ఆక్రందన, డాక్టర్‌ సుమన మందోదరి హితబోధ, గోపాలకృష్ణ శాస్త్రి సీతా స్వయంవరం, శివశంకర్‌ రుక్మిణి సందేశం, శివారెడ్డి ఒంటిమిట్ట రామాలయం ప్రాశస్త్యం అంశాలపై కవి సమ్మేళనం నిర్వహిస్తారు. 18వ తేదీ రాంప్రసాద్‌రెడ్డి ఒంటిమిట్ట రామాలయం ప్రాశస్త్యం, వెంకటరమణ హనుమత్‌ సందేశం, నీలవేణి రంతి దేవుని చరిత్ర, వెంకటేశ్వర ఆచారి శ్రీరామ లక్ష్మణుల సోదర ప్రేమ, మధుసూదన్‌ శ్రీకృష్ణ లీల, మల్లికార్జునరెడ్డి జానకి సందేశం, నరసింహులు రామరాజ్యం జగన్నాథ్‌ సుందరకాండ అంశాలపై కవి సమ్మేళనం నిర్వహిస్తారు. శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా 17 నుండి 25వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 10 నుండి రాత్రి 9 గంటల వరకు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

➡️