కడప గౌస్‌నగర్‌ ఘటనపై సిఐ, ఐదుగురు ఎస్‌ఐలకు ఛార్జ్‌మెమో

ప్రజాశక్తి-కడప క్రైం
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున కడప నగరంలోని గౌస్‌నగర్‌లో రెండు గ్రూపుల మధ్య రాళ్ల దాడులు జరిగిన ఘటనపై వైఎస్‌ఆర్‌ జిల్లా ఎస్‌పి సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న సిఐ, ఐదుగురు ఎస్‌ఐలకు ఛార్జ్‌మెమో జారీ జారీ చేశారు. కడప వన్‌టౌన్‌ సిఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐలు రంగస్వామి, తిరుపాల్‌నాయక్‌, మహమ్మద్‌ రఫీ, ఎర్రన్న, అలీఖాన్‌కు ఛార్జ్‌ మెమోలు పంపించారు. వీరందరిపైన శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 13వ తేదీన కడప నగరంలోని గౌస్‌నగర్‌లో వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనను పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించింది. టిడిపి కార్య కర్తలపై దాడులకు తెగబడేలా వైసిపి కార్యకర్తలను ఉప ముఖ్యమంత్రి అంజా ద్‌బాషా కుటుంబ సభ్యులు రెచ్చగొడుతూ భయానక వాతావరణం సృష్టించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎవరినీ నిలువరించలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై ఎస్‌పి సిద్ధార్థ్‌ కౌశల్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. ఆ రోజు విధుల్లో ఉన్న అధికారులందరికీ ఛార్జి మెమోలు దాఖలు చేశారు. కౌంటింగ్‌ రోజున కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసులను ఎస్‌పి ఆదేశించారు.

➡️