ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌
ప్రజాశక్తి – కడప
విద్య ఎంతో విలువైందని, క్రమశిక్షణతో అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి, డిఎల్‌ఎస్‌ఎ ఇన్‌ఛార్జి సెక్రటరీ ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం సందర్భంగా శనివారం కడప నగరంలోని ప్రభుత్వ బాలుర వసతి గహంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ 1979, మే 25న న్యూయార్క్‌లో పాఠశాలకు వెళుతున్న ఆరేళ్ల పిల్లవాడైన ఎటాన్‌ పాట్జ్‌ అదశ్యమయ్యాడని, ఎప్పటికీ చేధించలేని మిస్టరీగా ఆ కేసు మిగిలిపోయిందని అన్నారు. 1983లో యునైటెడ్‌ స్టేట్స్‌ అధ్యక్షులు రోనాల్డ్‌ రీగన్‌ మే 25ను ఎటాన్‌ పాట్జ్‌ జ్ఞాపకార్ధంగా జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు. 2001, మే 25న మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారని తెలిపారు. తప్పిపోయిన పిల్లల, అపహరణకు గురైన పిల్లల గురించి ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు అని చెప్పారు. 2001 నుండి 6 ఖండాల్లోని 20కి పైగా దేశాల్లో ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు అని అన్నారు. 1998లో యున్కెటెడ్‌ స్టేట్స్‌లో ఐసిఎంఇసి అనే సంస్థ ప్రారంభించారని పిల్లల అపహరణ, పిల్లలపై లైంగిక వేధింపులు, పిల్లల దోపిడి లేకుండా ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి పనిచేస్తున్న లాభపేక్ష లేని సంస్థ అని చెప్పారు. అల్బేనియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెలారస్‌, బెల్జియం, బ్రెజిల్‌, కెనడా, చిలీ, కోస్టారీకా, ఈక్వడార్‌, జర్మనీ, గ్రీస్‌, గౌతమాలా, ఐర్లాండ్‌, ఇటలీ, జమైకా, లుధియానా, మెక్సికో, నెదర్లాండ్స్‌, పోలాండ్‌, పోర్చుగల్‌, రష్యా, సెర్బియా, దక్షిణ కొరియా, స్పెయిన్‌, త్కెవాన్‌, యున్కెటెడ్‌ కింగ్‌డమ్‌, యున్కెటెడ్‌ స్టేట్స్‌ వంటి 29 దేశాలు ఈ సంస్థ పరిధిలో పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల అపహరణ సమస్యను గుర్తించడానికి, పిల్లలను సంరక్షణకు తీసుకోవాలసిన కొన్ని చర్యల గురించి తల్లిదండ్రులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చేలా ఐసిఎంఐసి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది అని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర వసతి గహం సూపరిండెంట్‌ జి.వీరయ్య, డిస్ట్రిక్‌ ప్రొహిబిషన్‌ ఆఫీసర్‌ జి చెన్నారెడ్డి, డిప్యూటీ చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ శాంత, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ మనోహర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ జె లక్ష్మి, పిల్లలు పాల్గొన్నారు.

➡️