తెలుగు లిపి పరిణామ పరిశోధనలో మేటి ‘తిరుమల రామచంద్ర’

ప్రజాశక్తి – కడప అర్బన్‌
యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సోమవారం ఉదయం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో తిరుమల రామచంద్ర 112వ జయంతిని నిర్వహించింది. ముందుగా సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్‌ చింతకుంట శివారెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులుగా, సంపాదకులుగా, కవిగా, నాటకకర్తగా, విమర్శకులుగా, భాషావేత్తగా, అనువాదకులుగా అనేక ప్రక్రియల్లో రచనలు చేసినప్పటికీ తిరుమల రామచంద్ర తనను తాను ఎంతో వినయంతో ‘భాషా సేవకుడను’ అని అభివర్ణించుకునేవారన్నారు. తిరుమల రామచంద్ర శ్రీకష్ణదేవరాయల కులగురువైన తిరుమల తాతాచార్యుల వంశీకులని, ఆయన తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కత, ప్రాకతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త అని అన్నారు. ఆయన పలురకాల వత్తులు చేయడం ద్వారా, భారతదేశంతోపాటు ఆప్ఘనిస్థాన్‌, బెలూచిస్థాన్‌ వంటి దేశాలు తిరిగి, వివిధ సంస్కతుల పట్ల చక్కని అవగాహన ఏర్పరచుకున్నారని అన్నారు. ఆయన విద్యార్థిదశలో గాంధీని చూసి ప్రభావితులై స్వాతంత్య్ర సమరంలో పాల్గొని జైలుకు వెళ్ళారని అన్నారు. ఆయన ఇతర భాషల్లోని పలు రచనలను తెలుగులోకి అనువదించిన గొప్ప అనువాదకుడని అన్నారు. ‘హంపీ నుంచి హరప్పా దాకా’ అనే ఆయన ఆత్మకథ ఆత్మకథల్లోనే చాలా విలక్షణమైందని, ఆ గ్రంథానికి ఆయన మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందని పేర్కొన్నారు. గ్రంథాలయ సహాయకులు జి.హరిభూషణరావు మాట్లాడుతూ తిరుమల రామచంద్ర ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి,హిందుస్తాన్‌ సమాచార్‌, భారతి పత్రికలలలో వివిధ హోదాలలో పనిచేశారని, పరిశోధన అనే ద్వెమాసపత్రికకు సంపాదకత్వం వహించారని అన్నారు. గాథాసప్తశతిలో తెలుగు పదాలు, సాహితీ సుగతుని స్వగతం వంటి అనేక రచనలు చేశారని అన్నారు. తిరుమల రామచంద్ర గొప్ప దేశభక్తుడని, తిరుపతిలో చదువుకుంటున్నప్పుడు బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా గోవిందరాజస్వామి దేవాలయంపై జాతీయ జెండాను ఎగురవేశారని అన్నారు. భగత్‌సింగ్‌ను ఉరి తీసిన సందర్భంలో ఆంగ్లేయులు చాలామంది స్వాతంత్య్ర సమరయోధులతో పాటు రామచంద్రను కూడా అరెస్టు చేసి దాదాపు సంవత్సర కాలం జైలులో ఉంచారని అన్నారు. రచయిత కొత్తపల్లె రామాంజనేయులు మాట్లాడుతూ రామచంద్ర మనిషి రూపంలోని విజ్ఞాన సర్వస్వమని, నిరాడంబరంగా ఉంటూ ఎప్పుడూ ఖద్దరు వస్త్రాలు ధరించేవారని అన్నారు. ఆయన రచించిన నుడి, నానుడి, మనలిపి పుట్టు పూర్వోత్తరాలనే గ్రంథాలు భాషాశాస్త్రంలో చాలా విలువైన గ్రంథాలని అన్నారు. ‘సరస్వతీపుత్ర’ పుట్టపర్తి నారాయణాచార్యులు, రామచంద్ర తిరుపతి శ్రీవేంకటేశ్వర సంస్కత కళాశాలలో కలసి చదువుకున్నారని అన్నారు. రామచంద్ర రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో హవల్దార్‌ గుమాస్తాగా ఆప్ఘనిస్థాన్‌, బెలూచిస్థాన్‌ సరిహద్దుల్లో పనిచేశారని, అటు పత్రికా రంగంలో, ఇటు సాహితీరంగంలో అనితర సాధ్యమైన కషి సల్పిన ఆయన సామాన్యుడుగా కనిపించే అసామాన్యుడని అన్నారు. రామచంద్ర చిన్నతనంలో నత్తితో బాధపడ్డారని, ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు చెప్పిన పద్ధతులు పాటించి ఆయన నత్తిని పోగొట్టుకున్నారని అన్నారు. కార్యక్రమంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సిబ్బంది, పాఠకులు రంగా, రాజేష్‌, దిలీప్‌, నాగరాజు పాల్గొన్నారు.రామచంద్ర చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సిపి బ్రౌన్‌ సిబ్బంది

➡️