కాంగ్రెస్ ప్రచార ఆడియో సిడిని అవిష్కరించిన తులసి

Mar 25,2024 15:38 #Kadapa

ప్రజాశక్తి – వేంపల్లె : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ప్రచార ఆడియో సిడిని పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ఆవిష్కరించారు. సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిడి ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఆడియో సిడిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఆడియో సిడిలో పాటలతో పాటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు సంబంధించిన ప్రసంగాలు కూడ ఉన్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు మాఫీ, మహాలక్ష్మి పథకం కింద ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సహయం చేయడం జరుగుతుందని తెలిపారు. కడపలో స్టీల్ ప్లాంట్, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, అమరావతిలో ప్రజా రాజధాని, పోలవరం, విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో అభివృద్ధి చేయడం, సిపిఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ పునరుద్ధరణ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే విభజన చట్టంలోని 10 సూత్రాలను అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెసు చేపట్టే మేనిఫెస్టోను సిడి ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ధృవకుమార్ రెడ్డి, సుబ్రమణ్యం, నిమ్మకాయల రాజా, రామకృష్ణ, బాలం సుబ్బరాయుడు, నరసింహరెడ్డి, బద్రి, అమర్నాథ్ రెడ్డి, మాస్, వినయ్, తిరుపాల్ రెడ్డి, వేమయ్య, సయ్యద్ మదార్ బాష, రాజు, రవి, శివ పాల్గొన్నారు.

➡️