అసౌకర్యాల చెరలో ప్లస్‌ టు

Jan 23,2024 23:02
ప్రభుత్వ విద్యారంగాన్ని

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు పిఠాపురం బిఆర్‌ ప్రభుత్వ హైస్కూల్లో ‘ప్లస్‌ టు’ (మహిళా జూనియర్‌ కళాశాలలు)ను గత విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. కార్పొరేట్‌ కళాశాలలకు ధీటుగా వీటిని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ సౌకర్యాలు కల్పించడం మరిచిపోయింది. దాంతో గత ఏడాది ఇక్కడ కేవలం ఐదుగురు మాత్రమే ఎంపిసి, బైపిసి గ్రూపుల్లో చేరారు. ఇదే స్కూల్లో గత ఏడాది సుమారు 100 మంది వరకు పదోతరగతి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి బయటకు వెళ్ళిపోయారు. ఈ ఏడాది కేవలం 16 మంది మాత్రమే చదువుతున్నారు. మొదటి సంవత్సరం 12 మంది ఉండగా ద్వితీయ సంవత్సరం కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నామని గొప్పలు చెబుతున్న సర్కారు ఆచరణలో మౌలిక సదుపాయాలను కల్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇంటర్‌ చదివే పిల్లల కోసం జిల్లాలో ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లో ప్లస్‌ టూ అంటూ ప్రారంభించిన మహిళా ఇంటర్‌ కళాశాలలను సమస్యలు వేధిస్తున్నాయి. దాంతో ‘ప్లస్‌ టూ’లో చేరేందుకు బాలికలు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. జిల్లాలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి పెద్దాపురం మండలంలో 13 మంది, గొల్లప్రోలు మండలంలో 42, ఏలేశ్వరంలో 35, గండేపల్లిలో 24, యు.కొత్తపల్లి మండలంలో 65, జగ్గంపేటలో 34, సామర్లకోటలో 28, పిఠాపురంలో 16, కిర్లంపూడిలో 71, రౌతులపూడిలో 63, కాకినాడ రూరల్‌ లో 110, కరపలో 43, పెదపూడిలో 42, ప్రత్తిపాడులో 78 మంది చదువుతున్నారు. మొత్తంగా 14 కళాశాలల్లో 629 మంది చదువుతున్నట్లు విద్యాశాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే ఇంటర్‌ మొదటి సంవత్సరంలో కొంతమంది చేరుతున్నప్పటికీ చాలామంది రెండవ సంవత్సరం వచ్చేసరికి ఇతర కళాశాలలకు మారుతున్నారు. ఇలా ప్రస్తుతం సుమారు 500 మంది మాత్రమే చదువుతున్నట్లు సమాచారం.అసౌకర్యాల నడుమ చదువులుకేవలం ఎంపిసి, బైపిసి గ్రూపుల్లో మాత్రమే అడ్మిషన్లకు అవకాశం కల్పించడంతో అనేకమంది విద్యార్థులు ప్రైవేటు కళాశాలలవైపు వెళుతున్నారు. ఆయా హైస్కూళ్లను విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక సతమతమవుతుంటే వాటిల్లోనే ఇంటర్‌ తరగతులను కూడా నిర్వహిస్తుండడంతో సమస్యలు వేధిస్తున్నాయి. మరోవైపు చాలా కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఉంది. దాంతో ప్లస్‌ టులో చేరేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తిని చూపలేకపోతున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో పుస్తకాల కూడా అందించలేని దుస్థితి నెలకొంది. అన్నిచోట్లా విద్యార్థుల సంఖ్యకనుగుణంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయలేక పోయారు. దాతల సహకారం తీసుకుని కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు పుస్తకాలను సమకూర్చుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గతేడాది ఉత్తీర్ణత దారుణంగా పడిపోయింది. చాలా మంది ఫెయిల్‌ అయ్యారు. ఈ ఏడాదైనా పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో ఇస్తారనుకుంటే అవి కూడా లేవు. మరో రెండు నెలల్లో పరీక్షలు ఉండనున్న నేపథ్యంలో ఉత్తీర్ణతపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని చోట్లా యూనిఫాం, మధ్యాహ్న భోజనం, హాస్టల్స్‌ సౌకర్యం, సరిపడా మరుగుదొడ్లు ఇలా కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు.

➡️