ఆమడ దూరంలో సంరక్షణ

Feb 21,2024 23:11
పర్యావరణ సమతుల్యతను

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్న ప్రకృతి ప్రసాదించిన మడ అడవుల సంరక్షణను కాకినాడ జిల్లాలోని అధికారులు గాలికి వదిలేసారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తీర ప్రాంతాలకు సహజ రక్షణ గోడలుగా ఉండడమే కాకుండా, సముద్ర తీర జీవవైవిధ్యంలో కీలక పాత్ర వహిస్తున్న వీటిపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి మనుషుల్ని, వన్యప్రాణుల్ని కీలకంగా కాపాడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో కాకినాడ నగరానికి చెందిన లబ్ధిదారులకు ఇచ్చేందుకు దుమ్ములపేట సమీపంలోని తీర ప్రాంతంలో సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మడ అడవులను అధికారులు గుర్తించారు. స్థానిక పాలకుల ఒత్తిడితో జీవవైవిధ్యానికి ప్రతీకగా ఉన్న ఈ ప్రాంతంలో 60 ఎకరాల్లోని మడఅడవిలోని చెట్లను పూర్తిగా నరికి చేసి గ్రావెల్‌తో పూడ్చి వేశారు. సుమారు 31 వేల మందికి ఇళ్ల స్థలాల కోసం 2020లో ఏకపక్షంగా వ్యవహరించి మడ అడవులను ధ్వంసం చేశారు. సంబంధిత స్థలాన్ని మెరక చేయడం కోసం సుమారు రూ.20 కోట్లుపైనే ప్రజాధనాన్ని వధా చేశారనే ఆరోపణలు అప్పట్లో గట్టిగా వినిపించాయి. ఈ నేపథ్యంలో వైజాగ్‌కు చెందిన పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ 2020 మార్చిలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి)ని ఆశ్రయించారు. దీనిపై సంబంధిత శాస్త్రవేత్తల బృందం మడ అడవుల విధ్వంసం సరికాదని, వెంటనే ధ్వంసం చేసిన మడ చెట్లను పునరుద్ధరించాలని రూ.5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది.ఎన్‌జిటి ఆదేశాలు పట్టని అధికారులుతన తప్పు తెలుసుకున్న వైసిపి ప్రభుత్వం గతేడాది మార్చిలో అపరాధ రుసుంను ఎపి కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌కు జమ చేసి చేతులు దులుపుకుంది. నగరపాలక సంస్థ అధికారులు మాత్రం ఈ సైట్‌ కోర్టు స్టేటస్‌ కో ఆర్డర్‌ పరిధిలో ఉన్నట్లు అక్కడ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అయితే మడ మొక్కల సంరక్షణ మాత్రం మరిచిపోయింది. తూతూమంత్రంగా సుమారు పదివేల మొక్కలను నాటినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ప్రస్తుతం అక్కడ ఒక మొక్క కన్పించిన దాఖలాలు లేవు. అయితే వేసిన మొక్కలు పూర్తిగా ఎండిపోయి వాటి ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. అనధికారికంగా మెరక చేసిన ప్రాంతంలో మట్టిని కూడా తొలగించకుండానే అధికారులు ఎస్‌జిటి ఆదేశాలను పూర్తిగా విస్మరిస్తున్నారనే విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. వాస్తవానికి కంకర రాళ్లతో కూడిన గ్రావెల్‌ మట్టిని తొలగించి, గతంలో ఉన్న బురద నేలను కనబడేలా పునరుద్ధరణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ మూడేళ్లు గడుస్తున్నా అధికారులు అటువంటి చర్యలు ఏమీ తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా కాకినాడ నగరపాలక సంస్థతోపాటు పోర్టు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయంగా మడ అడవుల పునరుద్ధరణ, పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

➡️