ఓటింగ్‌ శాతం పెంచేందుకు కృషి

Feb 24,2024 23:36
ఓటింగ్‌ శాతం పెంచేందుకు కృషి

ప్రజాశక్తి-కాకినాడలోక్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగేందుకు వివిధ శాఖల వారీగా నిర్ణయించిన అవగాహన కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయాలని డిఆర్‌ఒ డాక్టర్‌ తిప్పేనాయక్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో సాధారణ ఎన్నికలకు సంబంధించి స్వీప్‌ కార్యక్రమాల నిర్వహణపై డిఇఒ పి.రమేష్‌తో కలిసి అధికారులతో డిఆర్‌ఒ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిప్పే నాయక్‌ మాట్లాడుతూ రానున్న సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. అందరూ ఎన్నికల్లో భాగస్వామ్యం అయినపుడే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదు అవుతుందని. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం మెరుగు పడేందుకు ఓటర్లను చైతన్య పరుస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇంజనీరింగ్‌, డిగ్రీ కళాశాలలతో పాటు నర్సింగ్‌ కళాశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టి యువ ఓటర్లకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన సదస్సులు, వివిధ పోటీలు నిర్వహించాలన్నారు. వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లే కార్మికుల కుటుంబాలు, మత్స్యకారుల గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వాల్‌ పోస్టర్లు, మైక్‌ అనౌన్స్‌మెంట్లు, ఎలక్ట్రానిక్‌ మీడియా, దినపత్రికల ద్వారా నైతిక ఓటు హక్కు వినియోగంపై విస్తత ప్రచారం కల్పించాలన్నారు. ఇవిఎం, వివిప్యాట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగంపై పోలింగ్‌ కేంద్రాల వద్ద అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ తేదీ రెండు, మూడు రోజుల ముందు వరకు ఈ స్వీప్‌ కార్యక్రమాలు జిల్లా అంతటా సక్రమంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సంయుక్తంగా, బాధ్యతతో చేపట్టి జిల్లాలో ఓటింగ్‌ శాతం మెరుగు పడేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఒ కె.భారతి సౌజన్య, ఐసీడీఎస్‌ పీడీ కె.ప్రవీణ, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, ఆర్టీవో పీవీ సాయి ప్రసాద్‌, జిల్లా పౌర సంబంధాల అధికారి డి.నాగార్జన్‌, ఇన్చార్జి మత్స్య శాఖ అధికారి కె.కరుణాకర్‌, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ బుల్లి రాణి, డీఎల్డీవో పి.నారాయణ మూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️