ఓటు ప్రాధాన్యతను గుర్తించండి

Jan 26,2024 00:07
గుర్తించండి

ప్రజాశక్తి – యంత్రాంగం

జాతీయ ఓటరు దినోత్సవాన్ని గురువారం జిల్లాలోని పలు మండలాల్లో అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించారు.

కాకినాడ యువత ఓటు విలువను గుర్తించి తప్పనిసరిగా ఓటును వినియోగించుకునేలా చైతన్యవంతులు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా పిలుపునిచ్చారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గురువారం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. తొలుత పిఆర్‌ కళాశాల నుంచి స్మార్ట్‌సిటీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్మార్ట్‌సిటీ మీటింగ్‌హాలులో జరిగిన ఓటర్ల దినోత్సవ సభను కలెక్టర్‌తోపాటు, ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ, కుడా ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఎస్‌పి సతీష్‌కుమార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌.నాగనరసిం హారావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. నగర కమిషనర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఓటుకు ఎంతో విలువ ఉందన్నారు. ఓటును పొందడంతోపాటు వినియోగించుకోవడం అత్యంత ప్రధానమని సూచించారు. జిల్లాలో 50వేల మంది యువ ఓటర్లు నమోదు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే కేవలం 26 వేల మంది మాత్రమే నమోదయ్యారన్నారు. ఎస్‌పి మాట్లాడుతూ పౌరులంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు ఒక ఆయుధమన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ఆర్‌జెడి నాగమణి, డిప్యూటి కమిషనర్‌ కోన శ్రీనివాస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ డెమోక్రసీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ జి.అబ్బయ్య, ఎంహెచ్‌ఒ డాక్టర్‌ పృధ్వీచరణ్‌, మేనేజర్‌ కర్రి సత్యనారాయణ, టిపిఆర్‌ఒ మానే సత్యనారాయణ, తహశీల్దార్‌ చన్నయ దొర, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌, యుబిఎ విభాగాల ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ మరియు పిజి కళాశాలల అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బిఇవిఎల్‌.నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు ప్రశంసపత్రాలను, జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్‌ బృందాన్ని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ నల్లమిల్లి శేషారెడ్డి, డిగ్రీ కళాశాలల సెక్రెటరీ డాక్టర్‌ నల్లమిల్లి సుగుణా రెడ్డి అభినందించారు. పిఠాపురం స్థానిక ఆర్‌ఆర్‌బి హెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ వి.కేశవరావు మాట్లాడుతూ విద్యార్థులం దరూ ఓటు విలువను తెలుసుకుని ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒ డివి.కాశీ విశ్వనాధం, బుల్లిప్రసాద్‌, లెక్చలర్స్‌ సుందరయ్య, శ్రీదేవి, లెబ్రేరి యన్‌ ఎండి హుసేన్‌ పాల్గొన్నారు.

గండేపల్లి సూరంపాలెం ఆదిత్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల గ్రంథాలయ విభాగం, ఎన్‌ఎస్‌ఎస్‌ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినో త్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 120 మంది విద్యార్థులు కొత్తగా ఓటును నమోదు చేసుకున్నారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఆదిరెడ్డి రమేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి కె.వెంకట రమణ, ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ రఘునాథ్‌, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌. డాక్టర్‌ మేడపాటి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒలు బి.రాంబాబు, ఐ.వీరాంజనేయులు పాల్గొన్నారు. అలాగే యల్లమిల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవ రణలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా ని ర్వహించారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్‌ నూక తట్టు నాగజ్యోతి, టిడిపి నాయకులు సుంకవిల్లి వీర వెంకట సత్యనా రాయణ పాల్గొన్నారు.

కాకినాడ రూరల్‌ ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎంఎస్‌ఎన్‌ క్యాంపస్‌లో రాజనీతి ప్రభుత్వ పాలనా శాస్త్రం విభాగం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఓటర్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. సహాయ ఆచార్యులు డాక్టర్‌ ఎం.నానిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్యాంపస్‌ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.ప్రశాంతి శ్రీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులన అందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ డాక్టర్‌ జోసఫ్‌ స్టీఫెన్‌, కోకన్వీనర్స్‌ డాక్టర్‌ హరిబాబు, డాక్టర్‌ గోపి, ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒ డాక్టర్‌ శ్రీదేవి, సహాయ ఆచార్యులు మహమ్మద్‌ నదీమ్‌, డాక్టర్‌ హారిక, డాక్టర్‌ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

పెద్దాపురం మండల తహశీల్దార్‌ వజ్రపు జితేంద్ర అధ్యక్షతన ఆర్‌డిఒ కార్యాలయంలో జరిగిన ఓటరు దినోత్సవ సభలో ఆర్‌డిఒ జె.సీతారామారావు మాట్లాడారు. అనంతరం ఆర్‌డిఒ కార్యాలయం నుంచి మున్సిపల్‌ సెంటర్‌, మెయిన్‌ రోడ్‌, మరిడమ్మ గుడి వీధి, సంత మార్కెట్‌ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం స్థానిక ఆర్‌ఆర్‌బిహెచ్‌ఆర్‌ ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.మాధవి పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తప్పనిసరిగా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పిఠాపురం, యు.కొత్తపల్లి, మండల తహశీల్దార్లు పి. త్రినాథరావు, జివిఎస్‌.ప్రసాద్‌, పిఠాపురం, గొల్లప్రోలు కమిషనర్లు కృష్ణవేణి, ఎం.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సామర్లకోట రూరల్‌ స్ధానిక బచ్చుఫౌండేషన్‌ మునిసిపల్‌ హైస్కూల్లో హెచ్‌ఎం తోటకూర సాయిరామకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం, ఓటు హక్కుపై సాయిరామకృష్ణ అవగాహన కల్పించారు. అనంతరం ఓటు హక్కును ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా వినియోగించుకుంటామని ఉపాధ్యాయులు, వార్డ్‌ పేరెంట్స్‌తో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా బిఎల్‌ఒలు వై.భరత్‌, ఎం.మాధవి మాట్లాడుతూ ఓటు హక్కును పొందేందుకు ప్రతీ ఏడాది ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించిందని అన్నారు. ఓటు వజ్రాయుధం అని, ఆ ఆయుధాన్ని ప్రతీ ఒక్క ఓటరు సద్వినయోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ గుబ్బల సత్తిబాబు, టీచర్లు వి.రాజు, జి.గోవిందు, కె.అరుణ, కెవివి.సత్యనారాయణ, ఎఎల్‌వి.కుమారి, తదితరులు పాల్గొన్నారు.

➡️