కదం తొక్కిన భవన కార్మికులు

Mar 1,2024 22:40
కదం తొక్కిన భవన కార్మికులు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిభవన నిర్మాణ కార్మికులు కష్టపడి దాచుకున్న రూ.2,500 కోట్ల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ఇతర అవసరాలకు మళించడం దారుణమని, తక్షణమే సంక్షేమ నిధులను కార్మికులకు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు బిల్డింగ్‌ వర్కర్లు డిమాండ్‌ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌ కార్యాలయాన్ని వారు ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై నినాదాలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వందలాదిమంది భవన నిర్మాణ రంగ కార్మికులు కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా చౌక్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు కార్మికులను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని తోసుకుంటూ కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు కార్మికులు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడ సుమారు రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. పోలీసులు, సిఐటియు నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి, సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు గడిగట్ల సత్తిబాబు, జిల్లా కార్యనిర్వహక అధ్యక్షుడు చెక్కల రాజ్‌ కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడారు. భవన నిర్మాణ రంగంలో పని చేసే 25 లక్షల కుటుంబాలకు జగన్మోహన్‌ రెడ్డి ఐదేళ్ల నుంచి అన్యాయం చేస్తున్నారన్నారు. దాచుకున్న సొమ్ము రూ.2500 కోట్లు అక్రమంగా చట్ట విరుద్ధంగా తరలించడం తగదన్నారు. 2019 నుంచి నష్టపరిహారాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తక్షణం చెల్లించాలని, సంక్షేమ పథకాలను నిలుపుదల చేస్తూ ఇచ్చిన 1214 సర్కిలర్‌ మెమోను రద్దు చేయాలని డిమాండ్‌ చేసారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతున్న నిర్మాణ రంగ కార్మికులు దాచుకున్న లేబర్‌ సెస్‌ నిధులను జగన్‌ ప్రభుత్వం పవర్‌ కార్పొరేషన్‌ పేరుతో తరలించుకు పోయి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరి స్తుండడం దారుణం అన్నారు. సంక్షేమ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా కార్మికుల, కూలీల సొమ్ము కాజేసి చీటింగ్‌ చేసారని విమర్శించారు. కార్మికుల సంక్షేమ పథకాలను నిలుపుదల చేయాలని స్వయానా ముఖ్యమంత్రి జగన్‌ 1214 మెమో ద్వారా ఆదేశించడంతో సహజ, ప్రమాద మరణాలలో గాయపడిన, చనిపోయిన కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో క్రెడారు సంస్థలో బిల్డర్లు సైతం నిర్మాణాలు నిలుపుదల చేయడంతో పనులు దొరక్క ఇతర రాష్ట్రాలకు వలసలు పోవాల్సిన పరిస్థితులకు జగన్‌ ప్రభుత్వమే కారణమన్నారు. మానవత్వం లేకుండా కార్మికుల జీవితాలతో చెలగాటమాడిన జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు కాకినాడ రూరల్‌ ఎంఎల్‌ఎ అభ్యర్థి పంతం నానాజీ మద్దతు తెలిపారు. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు చేర్చాలని సంఘం నాయకత్వం సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు చింతల సత్యనారాయణ, కిర్లంపూడి భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు జీవా, బోరా సత్తిబాబు, కార్పెంటర్ల సంఘం నాయకులు చక్రం, తాపీ మెస్త్రీల సంఘం నాయకులు చికట్ల సాంబశివ, కరప భవన నిర్మాణ సంఘం నాయకులు సురేష్‌, చేబ్రోలు వెంకటరమణ, నందేశ్వరరావు, కరణం విశ్వనాథం, కుంచే చిన్న, శివయ్య, జట్ల రెడ్డి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, దారపురెడ్డి క్రాంతి, వర్కింగ్‌ కమిటీ సభ్యులు నక్కెళ్ల శ్రీను, షేక్‌ పద్మ, నర్ల ఈశ్వరి, టి.రాజా, మెడిశెట్టి వెంకట రమణ పాల్గొన్నారు.

➡️