కదిలొచ్చిన అధికార యంత్రాంగం

Mar 28,2024 22:44
మండలంలోని పి.మల్లవరం

ప్రజాశక్తి – తాళ్లరేవు

మండలంలోని పి.మల్లవరం గ్రాంట్‌ ప్రాంతానికి నీటిపారుదల శాఖ అధికారులు తరలివచ్చారు. ఎండిపోతున్న పొలాల్లో మోటారు సైకిళ్లను బుధవారం నడిపి రైతులు నిరసన వ్యక్తం చేసిన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలోనే గురువారం గోదావరి డెల్టా సిస్టం చీఫ్‌ ఇంజనీర్‌ సతీష్‌కుమార్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఇ జి.శ్రీనివాసరావు, ఇతర అధికారుల బృందం మల్లవరం గ్రాంట్‌ గ్రామానికి కదిలి వచ్చారు. గ్రామానికి వచ్చిన అధికారులను రైతులు నిలదీశారు. రబీ సాగుకు పూర్తి స్థాయిలో సాగునీరు ఇస్తామన్నా భరోసాతోనే పంటలను సాగు చేశామని, అయితే పంట మధ్యలో అవసరమైన సాగునీరు లేకపోవడంతో ఎండిపోతున్నాయని, ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని రైతులు అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వళ్ళు రాజుబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు రైతుల సమస్యలపై వినతిపత్రాన్ని అందించారు. వెంటనే సాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రైతాంగ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఒఎన్‌జిసి, రిలయన్స్‌ సంస్థల వల్ల సాగునీటి ఎద్దడి సమస్య తలెత్తుతుందని దుయ్యబట్టారు. రైతాంగానికి కేటాయించిన సాగునీటిని మల్లంకోట లాకు వద్ద, తాళ్ళరేవు డివైడింగ్‌ టైం వద్ద పైపులైను ద్వారా ఆయా ఆయిల్‌ కంపెనీలు తరలించుకుపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులకు వివరించారు. సాగునీటి ఎద్దడి నివారణకు తక్షణమే విద్యుత్‌ మోటార్లు ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తామని రైతులకు అధికారులు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఒఎన్‌జిసి పైపులైను ద్వారా కొంత మేరకు సాగునీరు అందిస్తామన్నారు. చీఫ్‌ ఇంజనీర్‌ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పైపులైన్లు వేరే ఛానల్‌పై ఏర్పాటు చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అనంతరం ఎండిపోతున్న పంట పొలాలను అధికారులు పరిశీలించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు దూళిపూడి వెంకటరమణ, రైతులు దడాల కృష్ణ, పంపన శ్రీను, గుత్తుల కృష్ణ, సూరంపూడి శ్రీను, మావుళ్ళు, సత్యనారాయణ, మహేష్‌ పాల్గొన్నారు. ఒఎన్‌జిసి పైపులైన్‌ ద్వారా సాగునీరు విడుదల మండలంలో పి.మల్లవరం గ్రాంట్‌ ప్రాంతంలో ఎండిపోతున్న పంటలకు ఒఎన్‌జిసి పైపులైన్‌ ద్వారా గురువారం సాగునీటిని విడుదల చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్‌డిఒ కిషోర్‌ పర్యవేక్షణలో పంటపొలాలకు సాగునీటిని తరలించారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ మాట్లాడుతూ సాగునీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌ జెఇ ఇ. ఈశ్వర్‌, తహశీల్దార్‌ శ్రీనివాసరావు, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

➡️