కలెక్టర్‌గా జె.నివాస్‌ బాధ్యతల స్వీకరణ

Mar 29,2024 23:03
కలెక్టర్‌గా జె.నివాస్‌ బాధ్యతల స్వీకరణ

ప్రజాశక్తి-కాకినాడకాకినాడ జిల్లా కలెక్టర్‌గా జె.నివాస్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. తొలుత ఆయనకు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డి, డిఆర్‌ఒ డాక్టర్‌ డి.తిప్పేనాయక్‌ వివిధ శాఖల జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నిక ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేయడంతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. అభ్యర్థులకు కావలసిన అనుమతులు అన్నీ ఇస్తూ, ప్రజలకు ఏ సౌకర్యాలు కల్పించాలో వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ఇసి నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఏ విధంగా అనుమతులు ఇవ్వాలో, ఎన్నికల ప్రచారం, నామినేషన్‌ ప్రక్రియ, ప్రచారం అనుమతులు ఎప్పుడు చేసుకోవాలి వంటి తదితర వాటిని ప్రణాళిక ప్రకారం చేపడతామన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. జెడ్‌పి సిఇఒ ఎ.శ్రీరామ చంద్రమూర్తి, నగర పాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు, ఆర్‌డిఒ ఇట్ల కిషోర్‌, హౌసింగ్‌ పీడీ ఎన్‌వివి.సత్యనారాయణ, కుడా విసి కృష్ణమూర్తి, సమాచార శాఖ డిడి డి.నాగార్జున, కలెక్టరేట్‌ ఎఒ జి.ఎస్‌ఎస్‌ శ్రీనివాసు, వివిధ విభాగాల అధిపతులు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

➡️