కూటమి ఎంపీ అభ్యర్థులు ఎవరు..?

Mar 19,2024 23:39
ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో అన్ని పార్టీలు పార్లమెంట్‌ అభ్యర్థుల ఎంపికపై పూర్తిగా దృష్టి సారించాయి. ఇప్పటికే వైసిపి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్‌, అమలాపురం నుంచి మాజీ ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాద్‌, రాజమహేంద్రవరం నుంచి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ పేర్లను ప్రకటించింది. అయితే కూటమి అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానాలు ఇంకా కసరత్తులు చేస్తున్నాయి. కాకినాడ ఎంపీ స్థానానికి తంగేళ్ల ఉదరు శ్రీనివాస్‌ను ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మంగళవారం ప్రకటించారు. ఇక అమలాపురం, రాజమహేంద్రవరం అభ్యర్థులపై ఒక అవగాహనకు వచ్చినప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. టిడిపి, జనసేన, బిజెపి ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.మెజార్టీ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టిడిపి ప్రస్తుతం ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. మంగళవారం టిడిపి ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని ప్రచారం జరిగినా మళ్లీ వాయిదా పడింది. రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. పొత్తులో భాగంగా రాజమహేంద్రవరం నుంచి బిజెపి అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేయనున్నట్లు కూటమి నేతలు చెబుతున్నారు. అయితే అధికారికంగా ప్రకటన మాత్రం విడుదల కాలేదు. వాస్తవానికి ఆమె విశాఖపట్నం నుంచి బరిలో ఉండాలని భావిస్తుండగా కేంద్ర నుంచి పిలుపు వచ్చింది. బుధవారం బిజెపి ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో పురందేశ్వరి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సమావేశం తర్వాత ఆమె రాజమహేంద్రవరం నుంచి బరిలో దిగుతారనే ప్రకటన వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అమలాపురం ఉమ్మడి అభ్యర్థిగా టిడిపి నేత, లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌ గంటి హరీష్‌ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కీలక స్థానాలను టిడిపి ప్రకటించినప్పటికీ ఇక్కడ అభ్యర్థిని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అందుకు అనేక కారణాలున్నాయి. మాజీ ఎంపీ ఎజెవి. బుచ్చిమహేశ్వరావు కుమార్తె డాక్టర్‌ సత్యశ్రీ, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్‌ యాతాటి రమేష్‌ బాబు కూడా ఈ స్థానానికి పోటీ పడుతున్న నేపథ్యమే ఈ సిందిగ్ధతకు కారణంగా తెలుస్తోంది. వైసిపిపై పూర్తి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో రాపాక వరప్రసాద్‌ను ఢకొీట్టే అభ్యర్థిని ఎంపిక చేయాలని టిడిపి భావిస్తుంది. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లావ్యాప్తంగా ఆయా సామాజిక వర్గాల ఓట్లను రాబట్టుకునేందుకు కూటమి ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అమలాపురం పార్లమెంటు అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అభ్యర్థుల ఎంపికపై వైసిపి దూకుడుగా ఉన్నప్పటికీ కూటమి స్థానాల ఖరారుపై ఇంకా స్పష్టత రాకపోవడంతో టిడిపి, జనసేన శ్రేణుల్లో కొంత నిరాశ, నిస్సహలు నెలకొన్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రత్యర్థి అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో కూటమి అభ్యర్థులపై త్వరితగతిన స్పష్టత నివ్వాలని టిడిపి, జనసేన శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.

➡️