కూలి రేట్లు పెంచాలని హమాలీల నిరసన

Mar 1,2024 22:51
కూలి రేట్లు పెంచాలని హమాలీల నిరసన

ప్రజాశక్తి- సామర్లకోటపెరిగిన ధరలకు అనుగుణంగా ఎగుమతి కూలి రేట్లు పెంచాలని బేవరేజ్‌ హమాలీస్‌ రాష్ట్ర యూనియన్‌ పిలుపు మేరకు శుక్రవారం సామర్లకోట బేవరేజ్‌ డిపో దగ్గర హమాలీలు అర్ధనగ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి కొండలరావు మాట్లాడుతూ గత సంవత్సరం 2023 అక్టోబర్‌ నెలతో ఎగుమతి రేట్లకు సంబంధించి అగ్రిమెంట్‌ ముగిసిందని, నవంబర్‌ నుంచి రేట్లు పెంచి నూతన ఒప్పందం అమలు చేయాల్సి ఉందని చెప్పారు. ఎండిని నాలుగుసార్లు కలసి వినతిపత్రం అందజేసినా కాంట్రక్టర్‌ను పిలిపించి చర్చలు జరుపుతామని కాలయాపన చేస్తూ వస్తున్నారన్నారు. ఒక పక్క నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంటు ఛార్జీలు, పెట్రోల్‌ డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ పరిస్థితిలో రోజు కూలితో హమాలీల కుటుంబాలు గడవక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కార్పొరేషన్‌ యాజమాన్యం కాంట్రాక్టర్‌ను పిలిపించి వేతన ఒప్పందం అమలు చేయాలని, లేని పక్షంలో సమ్మెలోకి వెళ్ళవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు బి.ఆదినారాయణ, వి.అప్పలరాజు హమాలీలు పాల్గొన్నారు.

➡️