కొనసాగుతున్న శానిటేషన్‌ వర్కర్స్‌ ఆందోళన

Feb 3,2024 23:31
తమ సమస్యలు

ప్రజాశక్తి – కాకినాడ

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్‌ శానిటేషన్‌ వర్కర్స్‌(సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 4వ రోజు శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షుడు సిహెచ్‌. విజరుకుమార్‌ మాట్లాడుతూ పేదలకు సేవలు అందించడంలో జిజిహెచ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ కీలక పాత పోషిస్తున్నారని అన్నారు. తాము సమ్మె చేస్తే ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యజమానులు చెల్లించాల్సిన పిఎఫ్‌ వాటాను కార్మికుల జీతాల నుంచే చెల్లించడం దారుణ మన్నారు. ఇదే అంశాన్ని అధికారులకు, కాంట్రాక్టు సంస్థకు పలు దఫాలుగా విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే ఆందోళన చేపట్టాల్సివచ్చిందన్నారు. సోమవారం నుంచి తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామన్నారు. యూనియన్‌ మహిళా నేత జె. లక్ష్మీప్రియ మాట్లాడుతూ బియ్యం, నూనె, పప్పుదినుసులు వంటి నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. తమకు వచ్చే జీతం కుటుంబ ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. జీతాలు పెంచాలని, తమ జీతం నుంచి అదనంగా కత్తిరిస్తున్న పిఎఫ్‌ సొమ్ము తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ జిజిహెచ్‌ అత్యంత కీలకమైన విభాగం శానిటేషన్‌ అని అన్నారు. వైద్యులు, నర్సులు ఇతర పారామెడికల్‌ సిబ్బంది కంటే ముందుగా ఆసుపత్రిలో ఏ విభాగంలోనైనా శానిటేషన్‌ వర్కర్‌ అడుగు పెట్టాలన్నారు. కానీ జీతాలు, సౌకర్యాలు విషయంలో చివరలో ఉంటున్నారని తెలిపారు. కార్మికులు సమ్మె చేయాల్సి వస్తే జరగబోయే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎస్‌.వాసు, కృష్ణవేణి, చంద్రకళ, రమణమ్మ, పుష్ప, తలుపులమ్మ, భాగ్యలక్ష్మి, బి.శ్రీకాంత్‌, ఎం.యేసు, ఎం.రవి, వసంత్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️