చలో విజయవాడను జయప్రదం చేయండి

Feb 7,2024 23:19
తమ సమస్యల పరిష్కారం కోసం ఆశ కార్యకర్తలు నేడు

ప్రజాశక్తి – యంత్రాంగం

తమ సమస్యల పరిష్కారం కోసం ఆశ కార్యకర్తలు నేడు చలో విజయవాడకు తరలివెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆశా వర్కర్ల చలో విజయవాడను అడ్డుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధం అయ్యింది. సామర్లకోట పట్టణంలోని సిఐటియు జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాసును బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేసి సామర్లకోట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అలాగే వికె రాయపురంలో ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు గ్రేస్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అక్రమ అరెస్టు లను సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎన్‌.సురేష్‌, ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు, నాయకులు టి.నాగమణి, బాలం సత్తిబాబు, కరణం గోవిందరాజు ఖండించారు. పెద్దాపురం సిఐటియు నాయకుడు దారపు రడ్డి క్రాంతి కుమార్‌కు పెద్దాపురం పోలీసులు మంగళవారం అర్థరాత్రి 12 గంటలకు నోటీసు ఇచ్చి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా క్రాంతికుమార్‌ మాట్లాడుతూ పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. కాకినాడ రూరల్‌ మండలంలోని పండూరు పిహెచ్‌సి వద్ద కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగిది. ఈ సందర్భంగా కాకినాడ రూరల్‌ కార్యదర్శి టి.రాజా, నాయకులు ఎం.వెంకటరమణ మాట్లాడుతూ ఆశలకు కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా అనేక రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. నేడు జరిగే చలో విజయవాడ కార్యక్రమంలో ఆశలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

➡️