జనంతో పోటెత్తిన శైవ క్షేత్రాలు

Mar 8,2024 22:18
జనంతో పోటెత్తిన శైవ క్షేత్రాలు

ప్రజాశక్తి – యంత్రాంగం జిల్లాలోని శైవ క్షేత్రాలు శివరాత్రి సందర్భంగా యాత్రికులతో పోటెత్తాయి.సామర్లకోట శ్రీకుమార రామ భీమేశ్వరాలయం యాత్రికుల తాకిడితో మార్మోగింది. శుక్రవారం లక్ష మంది పైగా తరలి రాగా ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. మహా శివరాత్రి సందర్భంగా వేకువజాము ఒంటి గంటకు అభిషేక పూజలను నిర్వహించారు. అప్పటికే క్యూలైన్లలో వేచి ఉన్న యాత్రికులు శివుని ధర్మించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలోనూ, ఆలయ ముఖద్వారమైన ఆర్చి వద్ద గల పవిత్ర గోదావరి కాలువలో, దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన జల్లు స్నానఘట్టం వద్ద అధిక సంఖ్యలో స్నానాలాచరించారు. ఆలయానికి చేరుకునేందుకు శాశ్వత వంతెనతో పాటు ఇనుప కాలిబాట వంతెనను ఏర్పాటు చేయగా రెండు వంతెనలను, మాండవ్య నారాయణ స్వామి ఆలయం వద్ద గల వంతెనను రాక పోకలకు ఉపయోగించు కున్నారు. ఆలయం వద్ద భక్తుల భద్రత, ట్రాఫిక్‌ ఏర్పాట్లను పెద్దాపురం డిఎస్‌పి లతా కుమారి, సామర్లకోట సిఐ సురేష్‌ ఆధ్వర్యంలో సిబ్బంది పర్యవేక్షించారు.ప్రముఖుల పూజలుభీమేశ్వరాలయంలో పలువురు ప్రముఖులు పుజలు చేపట్టారు. పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప, వైసిపి పెద్దాపురం ఇన్‌ఛార్జి దవులూరి దొరబాబు, రాష్ట్ర కార్మిక శాఖ నాయకులు దవులూరి సుబ్బారావు, పెద్దాపురం ఆర్‌డిఒ జె.సీతారామారావు, పలువురు జడ్జిలు ఇతర ప్రముఖులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో ఆలయ నంది మండపంలో ఆశీర్వ దించారు. యాత్రికుల సేవలో స్వచ్ఛంద సంస్థలు భీమేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి సంద ర్భంగా శుక్రవారం వివిధ స్వచ్ఛంద సంస్థలు భక్తులకు విశేష సేవలు అందించారు. తెల్లవారు జాము నుంచే యాత్రికులు వేలాదిగా ఆలయానికి తరలి వచ్చారు. యాత్రికులు, చిన్న పిల్లలకు లయన్స్‌ క్లబ్‌, ఉప్పు వారి సత్రం, కొండపల్లి కృష్ణమూర్తి బ్రదర్స్‌, ఫ్రెండ్స్‌ ఫరెవర్‌, ఎస్‌బిఐ ఆధ్వర్యంలో పాలు, రొట్టెలు, మజ్జిగ, పులిహార, అల్పాహారం, తాగునీరు, భోజనాలు అందజేశారు. ఇంకా మదుగులమ్మ ఆలయం ఆధ్యర్యంలో భక్తులకు అల్పాహారం అందజేశారు. పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో యార్లగడ్డ వెంకట సుబ్బారావు మెమోరియల్‌ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. రౌతులపూడి మండలంలోని శృంగవరంలో ఉన్న నందనవనంలో మహాశివరాత్రి సందర్భంగా యాత్రికులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు యాత్రికులకు నందనవనం కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించారు. వందలాది మంది యాత్రికులు అన్నదానంలో పాల్గొన్నారు. గంగవరంలో భీమేశ్వరుని ఆలయానికి యాత్రికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తాళ్లరేవు శివనామస్మరణతో మండలంలోని శివాలయాలు మార్మోగాయి. పలు ఆలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు యాత్రికులు కిటకిటలాడారు. పిఠాపురం దక్షిణ కాశీగా వీరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రానికి యాత్రికులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి పాదగయ పుష్కరిణిలో స్థానాలు చేసిన అనంతరం కుక్కుటేశ్వర స్వామివారిని రాజరాజేశ్వరి అమ్మవారిని, పురుహుతికా అమ్మవారిని, దత్తాత్రేయ స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో వచ్చిన యాత్రికులకు సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ అధికారులు విఫలమయ్యారు. దేవస్థానం వెనుకవైపున ఉన్న గేటు తాళాలు వేసి అధికారుల వద్దే ఉంచుకోవడంతో దేవస్థానం లోపలికి వచ్చే వివిధ శాఖ ఉన్నతాధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్య శిబిరం నిర్వహణకు వచ్చిన వైద్యులను కూడా లోపలికి అనుమతించకపోవడంతో వారు వెనుదిరిగారు. ఏర్పాట్ల నిర్వహణలో అధికారుల వైఫల్యంపై ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ టి.వెంకటేశ్వరరావు, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ బాలిపల్లి రాంబాబు, శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం చైర్మన్‌ ఆర్‌.జనార్దన్‌ రావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎల్‌ఎ దొరబాబు సమక్షంలో ఇఒ పి.నారాయణమూర్తిని నిలదీశారు. కరప శివాలయాల్లో యాత్రికులు పోటెత్తారు. కరప రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఇఒ తిరుమల రవితేజ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఉప్పలంకలోని చొల్లంగి శివాలయంలో సముద్ర స్నానాలు చేశారు. కూరాడ, వేళంగి, నడకుదురు, అరట్లకట్ట గ్రామాల్లో శివరాత్రి పర్వదినం ఘనంగా నిర్వహించారు.

➡️