జిల్లాలో పలు చోట్ల వర్షం

Mar 20,2024 23:34
అల్పపీడన ద్రోణి ప్రభావంతో

ప్రజాశక్తి – యంత్రాంగం

అల్పపీడన ద్రోణి ప్రభావంతో బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. వర్షం వల్ల పలు ప్రాంతాలు జలమయం కాగా, మరికొన్ని ప్రాంతాల్లో మామిడి, జీడిమామిడి పంటకు తీవ్ర నష్టం చేకూర్చింది. సముద్రంలో మూడు బోట్లు గల్లంతు అయ్యాయి. అయితే 12 మంది మత్య్సకారులు సురక్షి తంగా ఒడ్డుకు చేరుకున్నారు.

కాకినాడ కాకినాడ నగరంలో ఆకస్మికంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతోపాటు వడగళ్ల వాన కూడా కురవడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. జగన్నాధపురం సామా పబ్లిక్‌ స్కూల్‌ ఎదురుగా ఉన్న భారీ వృక్షం ఈదురు గాలులకు కూలిపోవడంతో రెండు ద్విచక్ర వాహానాలు ధ్వంసం అయ్యాయి.

కరప తుఫాను ప్రభావంతో బుధవారం సాయంత్రం సముద్రంలో చేపలవేటకు వెళ్లిన మత్య్సకారుల బోట్లు గల్లంతయ్యాయి. ఈ ప్రమాదంలో మత్య్సకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదా నికి సంబంధించిన వివరాలు..మండలంలోని ఉప్పలంక గ్రామానికి చెందిన మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అయితే బుధవారం సాయంత్రం సముద్రంలో ఒక్కసారిగా ఉప్పొంగడంతో మత్య్సకారుల బోట్లు గల్లంతయ్యాయి. ఈ ప్రమాదంలో 12 మంది మత్య్సకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని, అయితే గ్రామానికి చెందిన మల్లాడి నూకరాజు, రేకాడ అగ్ని, కోలాట తాతారావులకు చెందిన బోట్లు సముద్రంలో గల్లంతయ్యాని సర్పంచ్‌ బొమ్మిడి నమోమి సతీష్‌ తెలిపారు. ఒక్కో బోటు విలువ రూ.4 లక్షల వరకూ ఉంటుందని వివరించారు.

సామర్లకోట సామర్లకోట పట్టణ, మండల పరిధిలో కుండపోత వర్షం కురిసింది. దీతో పట్టణంలోని పూ డికపోయిన మున్సిపల్‌ డ్రైన్లు కాలువలు వర్షం నీటితో పొంగిపొర్లాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షం కారణంగా మామిడి కాయలు రాలిపోయి తమకు నష్టం వాటిని మండల పరిధిలో మామిడి తోటల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

గండేపల్లి మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దీంతో డ్రైనేజ్‌ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పలుచోట్ల రోడ్లు చెరువులను తలపించేలా తయారయ్యాయి. రబీ సాగులో కోతలు ప్రారంభం కావడంతో అక్కడక్కడా ధాన్యం పొలాల్లోనే ఉండిపోయింది. ఈ వర్షం వల్ల ధాన్యం రాసులు నీళ్ల పాలైయింది. మామిడి, జీడి మామిడి రైతులకు నష్టాన్ని మిగిల్చింది.

కోటనందూరు కోటనందూరు గ్రామంలో బుధవారం ఉరుములు మెరుపులు పెనుగాలులతో వర్షంతో కురిసింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గోంప చిన్న గజ్జియ్యకు చెందిన వరి కుప్పపై పిడుగు పడింది. దీంతో వరి కుప్ప పూర్తిగా దహనం అయ్యింది. సుమారు లక్ష రూపాయలు విలువ చేసే ధాన్యం కాలిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

జగ్గంపేట అకాలవర్షంతో రైతుల గొగ్గోలు పెట్టారు. వర్షంతో కూడిన వడగళ్ల వానతో జీడి మామిడి, మామిడి రైతులు లబోదిబోమనే పరిస్థితి ఏర్పడింది. మరో 10, 15 రోజుల్లో పంట రైతుల చేతికొచ్చే సమయంలో కురిసిన వడగళ్ల వాన వారికి కన్నీటిని మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఆర్‌టిసి బస్‌స్టేషన్‌, ఎన్‌హెచ్‌ 16 సర్వీస్‌ రోడ్‌ పూర్తిగా నీటితో నిండి చెరువులను తలపించాయి.

➡️