తాతా..మనవరాలి మధ్యే పోటీ

Mar 15,2024 00:02
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపాడు

ప్రజాశక్తి – ఏలేశ్వరం

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో తాత, మనవరాలు మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది. నియోజకవర్గంలో ఎన్నడూ లేనివిధంగా వరుపుల కుటుంబం నుంచే ఇరు పార్టీల అభ్యర్థులు పోటీ పడడం ఇదే మొదటిసారి. ప్రత్తిపాడు నియోజకవర్గ ఏర్పడినప్పటి నుంచి పర్వత, వరుపుల, ముద్రగడ కుటుంబాల మధ్యనే అధికారం ఉంటూ వచ్చింది. గతంలో పర్వత కుటుంబానికి ముద్రగడ మద్దతు ఇస్తే వరుపుల ఓటమి చెందేవారు. ముద్రగడ కుటుంబానికి పరుపుల మద్దతిస్తే పర్వత కుటుంబం ఓటమిని చవిచూసేది. గత ఎన్నికల్లో అనూహ్యంగా వరుపుల సుబ్బారావు తన మనవుడు వరుపుల రాజాను కాదని పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌కు మద్దతు ఇవ్వడంతో ఆయన గెలుపొందారు. అనంతరం ఎంఎల్‌ఎ ప్రసాద్‌ తన విజయంలో కీలక పాత్ర పోషించిన వరుపులను దూరం పెట్టారు. తన మనవడు వరుపుల రాజా ఆకస్మికంగా మృతి చెందడంతో వరుపుల సుబ్బారావు అతని భార్య సత్య ప్రభను గెలిపించి పర్వత ప్రసాద్‌పై కక్ష తీర్చుకుంటారని అందరూ భావించారు. కాని ఈ ఎన్నికల్లో మేన ల్లుడు ఎంఎల్‌సి అనంత ఉదయభాస్కర్‌ ప్రోద్భలంతో వరుపుల సుబ్బారావు ప్రత్తిపాడు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను చేజిక్కించు కున్నారు. టిడిపి మొదటి జాబితాలో వరుపుల రాజా భార్య సత్యప్రభ పేరు లేకపోవడంతో రాజకీయంగా ఏ మలుపులు తిరుగుతాయోనని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో టిడిపి రెండో జాబితాలో చంద్రబాబు సత్య ప్రభను ప్రత్తిపాడు అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో తాత, మనవరాలు మధ్య పోటీ అనివార్యంగా మారింది. పర్వత వర్గం మద్దతు వీరిలో ఎవరికి లభించనుందనే చర్చ నియోజకవర్గంలో ఆసక్తిని రేపుతోంది. సత్యప్రభకు రాజా భార్యగా, ఆయన చనిపోవడంతో సింపతి, విద్యావంతురాలుగా, ఏలేశ్వరం వాస్తవ్యరాలిగా, ప్రత్తిపాడు కోడలుగా మంచి సంబంధాలు ఉండడం కలిసి వచ్చే అంశాలు కాకా, వరుపుల సుబ్బారావు గత రెండు పర్యాయాలు ఎంఎల్‌ఎగా చేసిన అనుభవంతో పాటు అందరినీ పేరుపేరునా పలకరించే స్వభావం కలిసొచ్చేఅంశాలుగా ఉన్నాయి. కిర్లంపూడి మండలం ప్రత్తిపాడు నుంచి విడిపోవడంతో ముద్రగడ ప్రభావం అంత మేర ఉండకపోయినా పర్వత ఆశీస్సులు కోసం ఇరు వర్గాలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తాత, మనవరాలి మధ్య పోటీలో నియోజకవర్గ ప్రజల తీర్పు ఎలావుంటుందో ఎన్నికల ఫలితాల వరకూ వేచిచూడాల్సిందే.

➡️