నిమిషం ఆలస్యమైనా ఇంటికే…

Feb 29,2024 22:08
ఇంటర్‌

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
జిల్లాలో 59 కేంద్రాలు సిద్ధం
పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండానే విద్యాసంవత్సరం ముగింపు
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి
ఇంటర్‌ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డ్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ నెల ఒకటి నుంచి 20వ తేదీద వరకూ థిరీ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు మాస్‌ కాపీయింగ్‌ కు చెక్‌ పెట్టే విధంగా పరీక్ష జరిగే ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్క నిముషం ఆలస్యమైనా అనుమతి లేదని అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లాలో 59 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు మొత్తం 44,179 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ జూనియర్‌ కళాశాలల్లో జనరల్‌, ఒకేషనల్‌ కలిపి ప్రథమ సంవత్సరం 22,059 మంది, ద్వితీయ సంవత్సరం 22,120 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఇంటర్‌ ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. కాకినాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పేపర్లు భద్రంగా ఉన్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ నిబంధనను కూడా అమలు చేయనున్నారు. పరీక్షల్లో విద్యార్థులు ఇబ్బందులు, ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే విద్యార్థుల హాల్‌ టికెట్లను ఆన్‌లైన్‌ లో ఉంచారు. వీటిని డౌన్లోడ్‌ చేసుకుని నేరుగా పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించారు. గతంలో మాదిరిగా హాల్‌ టికెట్లు కోసం కళాశాలల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇక ఉండదు. విద్యార్థి ఇచ్చిన ఫోన్‌ నంబరు పరీక్ష కేంద్రం పేరుతోపాటు గది నంబర్‌ వివరాలను మెసేజ్‌ రూపంలో పంపారు.నిఘా నీడనపరీక్షలు జరగనున్న అన్ని కేంద్రాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించే ప్రతి గదిలో సిసి కెమెరాలను బిగించాలని ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులు ఆదేశించారు. సిసి కెమెరాల ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. మాస్‌ కాపీయింగ్‌ జరిగితే సిసి కెమెరాల లైవ్‌ ద్వారా అధికారులు వెంటనే గుర్తించేందుకు అవకాశం ఉంది. జంబ్లింగ్‌ ద్వారా ఇన్‌విజిలేటర్లుపరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇన్విజిలేటర్లను జంబ్లింగ్‌ ద్వారా నియమించనున్నారు. పరీక్ష జరగనున్న కళాశాలలో అదే కళాశాలకు చెందిన ప్రిన్సిపల్‌, అధ్యాపకులు, సిబ్బంది ఎవరూ విధులు నిర్వర్తించే అవకాశం ఉండదు. ఇన్విజిలేటర్లు రోజురోజుకు మారుతుంటారు. పరీక్షలకు 59 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, మరో 59 మంది డిపార్ట్మెంటల్‌ అధికారులను నియమించారు. మూడు ఫ్లయింగ్‌ స్కాడ్‌, రెండు సిట్టింగ్‌ స్కాడ్‌లు పర్యవేక్షణ ఉంటుంది. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న అధ్యాపకులతో టాస్క్‌ ఫోర్స్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. వీరితోపాటు ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్లు నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఒక్కో పరీక్షా కేంద్రంలో 20 నుంచి 25 మంది వరకూ ఇన్విజిలేటర్లు ఉంటారు. ఇప్పటికే ప్రశ్నపత్రాలు సమీప పోలీసు స్టేషన్లకు చేరుకోగా అక్కడి నుంచి ఏ రోజుకారోజు పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాలను కేంద్రానికి తీసుకెళ్లనున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై ఇప్పటికే జిల్లా అధికారులు సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచాలని, అధికారులు, విద్యార్థుల ప్రయాణించే బస్సులకు టోల్‌ గేట్‌ లేకుండా చూడాలన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్‌ సౌకర్యం, ఫ్యాన్లు తప్పకుండా ఉండాలన్నారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్‌ అమలు చేయాలని పోలీసులకు ఆదేశించారు.అరాకొరగా పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అరాకొరగానే అందాయి. సిలబస్‌లో మార్పుల పేరుతో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలను అందించిన పరిస్థితి లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో 14 చోట్ల ప్లస్‌ టూ ఇంటర్‌ కళాశాలలను ప్రారంభించారు. అందుబాటులో ఉన్న అరకొర పుస్తకాలను ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోగా కొందరు బయట కొనుగోలు చేసి చదువుకున్నారు. స్తోమత లేని చాలామంది విద్యార్థులు పుస్తకాలను కొనుగోలు చేయలేక పక్క విద్యార్థుల వద్ద జిరాక్స్‌ తీయించుకుని చదువుకుని పరీక్షలకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ఉత్తీర్ణతా శాతంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఏర్పాట్లు పూర్తి
ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని కేంద్రాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసేలా ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులు అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. విద్యార్థులకు అవసరమైన బెంచీలు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర వసతులను కల్పించేందుకు ఏర్పాట్లు చేశాం..
-జిజికె.నూకరాజు, డిఐఇఒ, కాకినాడ

➡️