నేడు జెఎన్‌టియుకె స్నాతకోత్సవం

Jan 30,2024 23:07
సాంకేతిక విద్యారంగంలో

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

సాంకేతిక విద్యారంగంలో ఎప్పటికప్పుడు నూతన ఒరవడులను అందిపుచ్చుకుంటూ, కొంగొత్త ఆలోచనలకు పదును పెడుతూ, విద్యార్థులను వినూత్న ప్రయోగాల వైపు మళ్లిస్తూ… విప్లవాత్మక మార్పులతో ముందుకు దూసుకుపోతున్న కాకినాడలోని జవహర్‌ లాల్‌ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం ఈ నెల 31న 10వ స్నాతకోత్సవ పండుగకు సిద్ధమైంది. వర్సిటీ ఆవరణలో గల అలూమినీ ఆడిటోరియం వేదికగా జరగనున్న ఈ ఉత్సవానికి రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ సంబరాలకు 8 జిల్లాల నుంచి పలువురు ప్రముఖులు, ప్రొపెసర్లు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.జెఎన్‌టియుకెలో ఎంతో మంది సాంకేతిక ఓనమాలు దిద్దుకున్నారు. టెక్నాలజీ సాయంతో వేలమంది నిపుణులుగా ఎదిగారు. కష్టపడి చదివిన ప్రతిఒక్కరికీ అపురూప విజయాలు అందించిన నైపుణ్యం గల వర్సిటీగా జెఎన్‌టియుకె పేరుగాంచింది. 1946లో ఏర్పడిన జెఎన్‌టియు కళాశాలలో ఇప్పటివరకు ఎందరో ప్రముఖులు విద్యనభ్యసించారు. ఢిల్లీ మెట్రో రైలు ఎమ్‌డి ఇ.శ్రీధరన్‌ నుంచి ఎపిపిఎస్‌సి చైర్మన్‌ ఉదయభాస్కర్‌, శివసాగర్‌రావు, భాస్కరుడు, జి.ప్రసాదరావు, వరప్రసాదరెడ్డి, ఐఎఎస్‌ రవిచంద్ర, శ్యామలరావు, శ్రీకాంత్‌, సిఎస్‌ ప్రసాదరావు, ప్రస్తుతం మంత్రి ఆదిమూలపు సు రేష్‌ వరకు ఎంతో మంది ప్రము ఖులు ఈ కళాశాలలో ఇంజి నీరింగ్‌ విద్యనభ్యసించినవారే. సామా న్యులను సైతం అసమాన్య ఇంజి నీర్లగా తీర్చిదిద్దిడంతోపాటుగా అనేక మందికి అవకాశాలిచ్చి అద్భుత విజయాలను సాధించేలా తోర్పాటుని అందించింది. ఈ నేపథ్యంలో జెఎన ్‌టియుకె స్నాతకోత్సవాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దేందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టిసిఎస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్నకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేయనున్నారు. అలాగే 2023-2024 విద్యా సంవత్సరంలో పట్ట భద్రులైన విద్యార్థులకు కూడా పట్టాలు అందించనున్నారు.పలువురికి డాక్టరేట్లు ప్రధానంబుధవారం ఉదయం 10.30 గంటల నుంచి అలూమినీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని విసి ప్రసాదరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిగ్రీలు ప్రధానం చేస్తామన్నారు. ఈ స్నాతకోత్సవంలో 64 మంది రీసెర్చ్‌ స్కాలర్స్‌ పిహెచ్‌డి డిగ్రీలు అందుకోనున్నారు. అలాగే ఛాన్సలర్‌, ఇతర అతిథుల సమక్షంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎండోమెంట్‌ అవార్డులు, బంగారు పతకాలను అందిస్తామని తెలిపారు. బిటెక్‌లో 34,199 మంది, బి-ఫార్మశీలో 1,477 మంది, ఎంటెక్‌లో 1,689 మంది, ఎంబిఎలో 1,093 మంది, ఎంసిఎలో 343 మంది, ఎం.ఫార్మశీ లో 332, బిబిఎలో 21, ఫార్మా-డిలో 182, బి. ఆర్క్‌లో 13, బంగారు పత కాలు 28 మంది అందుకోనున్నారు.

➡️