పరిహారం కోసం ఎదురుచూపులు

Jan 28,2024 00:22
మిచౌంగ్‌ తుపాన్‌తో

ప్రజాశక్తి – కోటనందూరు

మిచౌంగ్‌ తుపాన్‌తో నష్టపోయిన రైతన్నలు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఎదురుచూపులు చూడక తప్పడం లేదు. తుపాను ప్రభావంతో నమోదు అయిన అధిక వర్షాలతో చేతికొచ్చిన పంట నీటి పాలు అయ్యింది. మండలంలోని 15 పంచాయతీల పరిధిలో 825 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. మీచాంగ తుఫానుతో కురిసిన అధిక వర్షాల వల్ల కొంత నేలకొరిగి, మరికొంత నీటమునిగి పంట నాశనం అయ్యింది.

మండల పరిధిలోని 15 గ్రామ పంచా యతీల పరిధిలో సుమారు 1601 మంది రైతులకు సంబధించిన 825 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. పంట నష్టం రూ.1.40 కోట్లు వరకూ ఉంటుందని అంచనా వేసినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్‌ ‘ప్రజాశక్తి’కి తెలిపారు. మండలంలోని కెఇ చిన్నయ్యపాలెం, కోటనందూరు, జగన్నాధపురం గ్రామాల్లో అత్యధికంగా పంట నష్టం జరిగింది. ఒక్కో ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ రైతన్నలు పెట్టుబడి పెట్టారు. అయితే పంట చేతికి వచ్చే దశలో తుపాన్‌ రైతులను నిండాముంచింది. తుపాను వీడిని వారం రోజుల తరువాత ప్రభుత్వం స్పందించి నష్టం అంచనాను వేసేందుకు యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. ఎట్టకేలకు అధికారులు పంట నష్టంను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలను అందించారు. అయితే ఈ తతంగం జరిగి రెండు నెలలు కావస్తుంది. అయితే ప్రభుత్వం రైతన్నలకు ఇస్తామన్నా పంట నష్టం రూ.6,500లను నేటికీ అందించిన పరిస్థితి లేదు. వడ్డీపై అప్పులు తెచ్చి పంటను సాగు చేశామని, తుపాన్‌ తమ బతుకులను నాశనం చేసిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడుస్తున్న కొలదీ తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని, వడ్డీ వ్యాపారుల ఒత్తిడి రోజు రోజుకీ పెరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతన్నలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని త్వరితగతిన అందించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పరిహారం ఇచ్చి ఆదుకోవాలి

ఖరీఫ్‌లో 2 ఎకరాల్లో వరి పంటను సాగు చేశాను. నాట్లు వేసే దశలో వర్షాలు లేకపోవడంతో ఇంజన్ల ద్వారా నీటిని తోడి పంటను కాపాడుకున్నాను. పంట చేతికి వచ్చిన దశలో తుపాను ప్రభావంతో కురిసిన అధిక వర్షం పంటను ముంచేసింది. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాను. ప్రభుత్వం ఇచ్చే పంట నష్టం పరిహారాన్ని త్వరితగతిన అందించాలని కోరుతున్నాను. -ఎల్‌.సత్తిబాబు, రైతు, కెఇ చిన్ని పాలెం గ్రామం

కుటుంబ పోషణ కష్టంగా మారింది

తనకున్న ఎకరన్నర పొలంలో ఖరీఫ్‌లో వరి పంటను సాగుచేశాను. ఆర్థిక ఇబ్బందుల రీత్యా అప్పులు చేసి మరీ సాగును చేపట్టాను. రేపోమాపో కోత కోసి పంటను ఇంటికి తెచ్చుకుందామని అనుకుంటున్న దశలో తుపాన్‌ తనకు కన్నీటిని మిగిల్చింది. మొత్తం పంట నీట మునిగి నాశనం అయ్యింది. పెరిగిన నిత్యవసర ధరలతో కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. పరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలి. -ఎం.సత్తిబాబు, రైతు, కొత్త కొట్టం గ్రామం.

➡️