పోర్టు భూములన్నీ కబ్జా

Jan 30,2024 23:10
ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డికి కన్పిస్తాయని,

ప్రజాశక్తి – కాకినాడ

పోర్టు భూములన్నీ కబ్జా చేయడానికే ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డికి కన్పిస్తాయని, నగర అభివృద్ధికి మాత్రం కన్పించవని మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు ఎద్దేవా చేశారు. ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి దుమ్ములపేట ప్రాంతంలో 1:4 టిడిఆర్‌ బాండ్లు మంజూరు చేసి కార్పొరేషన్‌ సేకరించిన 4.67 ఎకరాల భూమిని ఎంఎల్‌ఎ ద్వారంపూడి కబ్జా చేసిన పోర్టు భూములను మంగళవారం ఆయన పాత్రికేయులకు చూపించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కబ్జా చేయడానికి కనిపించిన పోర్టు భూములు సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి కనిపించలేదని అన్నారు. ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌ పేరుతో ఎందుకు పనికిరాని ప్రయివేటు భూమిని సేకరించి వాటికి రూ.251 కోట్ల విలువ చేసే బాండ్లు మంజూరు చేయించి కార్పొరేషన్‌ ఖజానాన్ని కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. టిడిపి పాలనలోనే జిఒ వచ్చిందని చెబుతున్న ద్వారంపూడి ప్రజాఉపయోగాల కోసమే ఆ జిఒ అని, ఎంఎల్‌ఎ దోచుకోవడానికి కాదని గుర్తుంచుకోవాలన్నారు. టిడిఆర్‌ బాండ్లతో మున్సిపాలిటీకి గాని, ప్రభుత్వ ఖజానాకు కానీ నష్టం లేదని చెబుతున్న ద్వారంపూడి అదే వాస్తవమైతే టిడిఆర్‌ బాండ్లు దేనికి ఇచ్చినట్టన్నారు. ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు కాకినాడ నగరంలో పోర్ట్‌ భూములు చాలా ఉన్నాయని, గతంలో పూలే పాకాల వద్ద సుమారు 8 ఎకరాలు పోర్ట్‌ భూమిని రాత్రికి రాత్రి ఫిల్లింగ్‌ చేసి కబ్జా చేస్తే, తాము అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పోర్టు భూములను కాపాడడం జరిగిందన్నారు. ఆ భూములు ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి పనికిరావా? అని కొండబాబు ప్రశ్నించారు. గత ప్రభుత్వ పాలనలో కాకినాడ – సామర్లకోట రోడ్డు విస్తరణకు, కొండయ్యపాలెం ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి, మెయిన్‌ రోడ్డు విస్తరణకు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి భూములను సేకరించి నగర అభివృద్ధికి కృషి చేశామని, ఆయనలాకార్పొరేషన్‌ ఖజానా కొల్లగొట్టే విధంగా టిడిఆర్‌.బాండ్లు మంజూరు చేయలేదన్నారు. పోర్టు భూములను సేకరించి టిడ్కో గృహాలను నిర్మించామని, నేడు ఆ గృహాలకే రంగులు వేసుకుని గొప్పలు చెప్పుకోవడానికి ఎంఎల్‌ఎ సిగ్గుపడాలని అన్నారు. సబ్‌ స్టేషన్‌ కోసం 4.67 ఎకరాలు సేకరించినందుకు అధికారులకు సన్మానం చేస్తానని ద్వారంపూడి చెబుతున్నాడని, సురేష్‌ నగర్‌ పార్క్‌ ప్రభుత్వ భూమిపై రూ.160 కోట్లు, సబ్‌స్టేషన్‌ పేరుతొ రూ.251 కోట్లు విలువ చేసే టిడిఆర్‌ బాండ్లు మంజూరు చేసి ప్రజా ధనాన్ని దోచుకోవడానికి అవకాశం కల్పించిన అధికారులకు ఒక్క సన్మానం ఏమిటి ఇంకేమైనా చేస్తాడని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్‌, ఒమ్మి బాలాజీ, బంగారు సత్యనారాయణ, చోడిపిల్లి సతీష్‌, కొండ్రు తాతారావు, ఎరుపిల్లి సత్తిబాబు, చోడిపిల్లి ప్రేమానందం, తదితరులు పాల్గొన్నారు.

➡️