మత సామరస్యానికి కృషి చేయాలి

Feb 10,2024 22:32
మత సామరస్యానికి కృషి చేయాలి

ప్రజాశక్తి-పిఠాపురంమత సామరస్యానికి, సర్వమత సౌభ్రాతత్వానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా పిలుపు నిచ్చారు. ఆశ్రమ ప్రాంగణంలో శనివారం పీఠం వార్షిక జ్ఞాన మహాసభల్లో శనివారం రెండో రోజు జరిగిన సభలో ఆలీషా మాట్లాడారు. భగవద్గీత, రామా యణం, బైబిల్‌, ఖురాన్‌ వంటి మత గ్రంథాలలో ఉండే అద్భుతమైన జ్ఞానశక్తి మానవత్వాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మికత అనేది మానవత్వపు విలువల యొక్క మార్గదర్శకంగా ఉంటుందన్నారు. అనంతరం పీఠం రూపొందించిన తత్వమార్గము 4వ భాగం, లైట్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌ గ్రంథాలు, కరపతాలను ఆయన ఆవిష్కరించారు. సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం విసి రాణి సదాశివమూర్తి, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ ప్రాచీన సాంప్రదాయాల్లో భాగమైన సూఫీ వేదాంత దర్శనాన్ని తరతరాలుగా ఈ పీఠం మానవాళికి అందిస్తోందన్నారు. విశ్వ మానవాళికి ఆధ్యాత్మిక విద్యను, విజ్ఞానాన్ని, సంస్కారాన్ని నేర్పుతున్న పీఠాధిపతి ఉమర్‌ ఆలీషా సేవలను కొనియాడారు. ట్రస్ట్‌ ద్వారా పీఠం అందిస్తున్న సేవలను ప్రశంసించారు. సభలో పాల్గొన్న ముఖ్య అతిథులు, వివిధ మతాలకు చెందిన ప్రతినిధులతో చేతులు కలిపి మత సామరస్యానికి, సర్వమత సౌభ్రాతత్వానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆలీషా పిలుపు ప్రతిజ్ఞ చేయించారు అఖిల భారత భవానీ దీక్షా పీఠం పీఠాధిపతి శివరామకృష్ణ స్వామీజీ, విశ్రాంత న్యాయమూర్తి విశ్వనాథం, ప్రణవ ఆశ్రమం పీఠాధిపతి సుమిత్రానంద సరస్వతి, హ్యూమన్‌ రైట్స్‌ ప్రొడక్షన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర వైస్‌ ఛైర్మెన్‌ బొంగరాల రవిచంద్రన్‌, పిఠాపురం సిఐ శ్రీనివాసు, డిఎంఅండ్‌ హెచ్‌ఒ డాక్టర్‌ నరసింహనాయక్‌ తదితరులు సభలో పాల్గొన్నారు. సభలో నిర్వహించిన సంగీతవిభావరిలో ఎ.ఉమ, ఐ.ఉమ ఆలపించిన కీర్తనలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్‌ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్‌ ఆకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు.

➡️