మోగిన ఎన్నికల నగారా

Mar 17,2024 00:42
ఎప్పుడెప్పుడా అని

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ శనివారం విడుదలైంది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. నాలుగో విడతలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్‌ 18న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. ఏప్రిల్‌ 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13న ఎన్నికల పోలింగ్‌ ఉంటుంది. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 21 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే అధికారులు ఎన్నికల ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేశారు. మూడు జిల్లాల్లోనూ 13 వేల మంది ఎన్నికల సిబ్బందిని నియమిస్తున్నారు. 21 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న పోలింగ్‌ కేంద్రాలకు తగ్గట్టుగా ఎన్నికల సిబ్బందిని సమకూర్చుకోవడానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో 1,637, తూర్పుగోదావరి జిల్లాలో 1,644, కోనసీమ జిల్లాలో 1,569 పోలింగ్‌ స్టేషన్లున్నాయి. ఒక్కో పోలింగ్‌ స్టేషన్లో ఒక పీవో, ఒక ఏపీవో, ఇరువురు పోలింగ్‌ క్లర్కులు, మరో ఇద్దరు విధులు నిర్వహించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పాటు 20 శాతం సిబ్బందిని అదనంగా అందుబాటులో ఉంచుతారు.ఇలా మొత్తంగా 13,032 మందితో పాటు 5,814 మంది అదనంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న వివిధ శాఖల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల వివరాలు 45 అంశాలతో కూడిన ప్రత్యేక ఫార్మాట్లో అప్లోడ్‌ చేయాలని ఇప్పటికే అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు ఉద్యోగులు వ్యక్తిగతంగా అన్ని వివరాలను నమోదు చేసి అప్‌ లోడ్‌ చేశారు.ఉమ్మడి జిల్లాలో 4,850 పోలింగ్‌ కేంద్రాలుమూడు జిల్లాల్లో ఏడేసి అసెంబ్లీ నియోజకవర్గాలుండగా కాకినాడ జిల్లా పరిధిలో 1,637, తూర్పుగోదావరి జిల్లాలో 1,644, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 1,569 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటిలో సమస్యాత్మకంగా ఉన్న 2,426 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. మిగిలిన కేంద్రాల్లో వీడియో కెమెరాల ద్వారా పోలింగ్‌ ప్రక్రియను చిత్రీకరిస్తారు.

➡️