లక్ష్యం ఘనం..ఆచరణ శూన్యం..!

Feb 20,2024 23:16
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డిజిటల్‌ గ్రంథాలయాలు ఏర్పాటు చేశామని వైసిపి ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటుంది. అయితే క్షేత్రస్థాయిలో నిర్మాణాలు నత్త నడకకు పోటీ పడుతున్నాయి. కేవలం ప్రచార ఆర్భాటం కోసం వీటిని ఏర్పాటు చేశారా? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఎక్కడ నిర్మాణాలు అక్కడే అన్నట్లుగా నిలిచిపోవడానికి నిధుల కొరతే కారణంగా తెలుస్తోంది. డిజిటల్‌ గ్రంథాలయాలపై ఆర్భాటపు ప్రకటనలకు కోసం చూపిన చొరవ నిధుల విడుదలలో మాత్రం చూపడం లేదని పలువురు విమర్శస్తున్నారు. లక్ష్యం ఇదీగ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు సాంకేతికతతో కూడిన సేవలందించేందుకు 2021 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్‌ఆర్‌ విలేజ్‌ డిజిటల్‌ గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. 2022 ఉగాది నాటికి మొదటి విడత, ఇదే ఏడాది డిసెంబర్‌ నాటికి రెండో విడత, 2023 జూన్‌ నాటికి మూడో విడతలో మొత్తం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. ఒక్కో గ్రంథాలయానికి రూ.30 లక్షలు ఖర్చు చేయాలని, భవన నిర్మాణానికే రూ.16 లక్షలు వెచ్చించాలనేది ప్రభుత్వ నిర్ణయం. మిగిలిన నిధులతో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, ఇంటర్‌ నెట్‌, కుర్చీలు, ఫ్యాన్లు, పుస్తకాలు, పోటీ పరీక్షలకు అవసరమైన బుక్స్‌, పత్రికలు, దినపత్రికలు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఒక ఎకరా స్థలంలో ప్రశాంత వాతావరణంలో భవనం ఉండే విధంగా కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మూడు విడతల్లో అన్ని పంచాయతీల్లో డిజిటల్‌ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. రెండేళ్లు దాటుతున్నా ఇప్పటి వరకు వీటి నిర్మాణాలలో పురోగతి కనిపించడం లేదు.నిధులు విడుదలే అసలు సమస్యపాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉపయోగపడేలా లైబ్రరీలను ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి డిజిటల్‌ గ్రంథాలయంలో 50 నుంచి 60 మంది కూర్చునేలా ఆధునిక వసతులు కల్పించాల్సి ఉంది. అయితే వీటి నిర్మాణానికి నిధులు సమస్య వెంటాడుతోంది. కాకినాడ జిల్లాలో మూడు విడతల్లో 119 లైబ్రరీల నిర్మాణాలు మొదలు కావాల్సి ఉంది. కానీ రెండేళ్ళుగా కేవలం రెండు చోట్ల మాత్రమే నిర్మాణాలు మొదలయ్యాయి. కాకినాడ రూరల్‌ రమణయ్యపేటలో పునాది దశలో, యూ. కొత్తపల్లిలో రూప్‌ లెవెల్‌లో నిర్మాణం ఆగిపోయింది. మిగిలిన కొన్నిచోట్ల స్థలాలు గుర్తింపు జరిగినా ఎక్కడా కూడా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. మరి కొన్నిచోట్ల స్థలాల సమస్య వెంటాడుతుంది. దీంతో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాలు ఎప్పటికీ ప్రారంభమవుతాయి, ఎప్పటికీ పూర్తి అవుతాయనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. భవన నిర్మాణానికి కేటాయించిన రూ. 16 లక్షలు సరిపోవని కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. కంప్యూటర్ల కొనుగోలుకు ఐటీ శాఖకు నిధులు కేటాయించలేదు. మొత్తంగా డిజిటల్‌ సేవలు అందని ద్రాక్షలా మారాయి.

➡️