లెనినిజం స్ఫూర్తితోనే కార్మిక పోరాటాలు

Jan 28,2024 23:15
ప్రపంచంలో ప్రస్తుతం

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న కార్మిక వర్గ పోరాటాలు లెనినిజం స్ఫూర్తితోనేనని మాజీ ఎంఎల్‌సి ఎంవిఎస్‌.శర్మ అన్నారు. కాకినాడ యుటిఎఫ్‌ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ”లెనినిజం విశిష్టత – అక్టోబర్‌ విప్లవం – భారతదేశం” అనే అంశంపై సదస్సు జరిగింది. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎంవిఎస్‌ శర్మ మాట్లాడుతూ ప్రపంచ విముక్తి సిద్దాంతాన్ని మార్క్స్‌ ఎంగెల్స్‌ రూపొందించగా, ఆచరణలో కార్మిక రాజ్య స్థాపన ఎలా జరుగుతుందో కార్యాచరణ ద్వారా లెనినిజం సాకారం చేసిందన్నారు. కార్మిక, కర్షక మైత్రి ప్రాధాన్యతను లెనినిజం చాటి చెప్పిందన్నారు. లెనిన్‌ ప్రసిద్ధ రచన ”ఏమిచేయాలి” కార్యాచరణకు మార్గదర్శిగా ఉందన్నారు. భగత్‌ సింగ్‌ ఉరితీసే కొన్ని క్షణాల ముందు కూడా లెనిన్‌ రచనలు అధ్యయనం పూర్తి చేసి ఉరికంబం ఎక్కారని గుర్తు చేశారు. వలసవాదాన్ని ఎదిరిస్తూ ప్రపంచంలో జాతీయ విముక్తి ఉద్యమాలకు అక్టోబర్‌ విప్లవం గొప్ప స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటానికి అక్టోబర్‌ విప్లవం ప్రేరణగా నిలిచిందని, తొలిసారిగా సంపూర్ణ స్వాతంత్య్రం నినాదం కమ్యూనిస్టు భావజాలం కలిగిన వారే ఇచ్చారని తెలిపారు. నేడు ప్రపంచంలో అనేక దేశాల్లో కార్మిక పోరాటాలు పెద్ద ఎత్తున జరుగుతు న్నాయని, వాటన్నింటి వెనుక లెనినిజం ఉం దన్నారు. మార్క్సిజం అర్ధం చేసుకుని, లెనిని జాన్ని కార్మిక వర్గం ఆచరణలో పెడితే సమ సమాజానికి మార్గం సుగమం అవుతుం దన్నారు. సదస్సుకు జన విజ్ఞాన వేదిక నాయ కులు జిఎస్‌హెచ్‌పి.వర్మ ఆహ్వానం పలుకగా యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు కెవివి.నగేష్‌ వందన సమర్పణ చేశారు. ఆర్‌విఎన్‌ స్టడీ సర్కిల్‌ కన్వీనర్‌ ఎన్‌. గోవిందరాజులుతోపాటు వివిధ ప్రజాసంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. తానీషా అభ్యుదయ గీతాలు ఆలపించారు.

➡️