వారసత్వ సంపదను రక్షించుకోవాలి

Feb 1,2024 22:32
వారసత్వ సంపదను రక్షించుకోవాలి

ప్రజాశక్తి-కాకినాడకాకినాడ నగరంలోని పురాతన సంపదను రక్షించుకోవాలని, పురాతన కట్టడాలను కాపాడుకోవాలని కరువు, వరదల నివారణ ప్రపంచ ప్రజా కమిషన్‌ చైర్మన్‌, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత డాక్టర్‌ రాజేంద్ర సింగ్‌ అన్నారు. గురువారం కాకినాడలోని కాస్మోపాలిటన్‌ క్లబ్‌లో వారసత్వ సంపద సంరక్షణపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద సమాజం మొత్తానికి చెందుతుందని వీటిని పరిరక్షించుకొని భవిష్యత్‌ తరాలకు అందజేయాలన్నారు. వారసత్వ సంపదలో పకృతి వనరులు, మడ అడవులు, హోప్‌ ఐలాండ్‌, తూర్పు తీర ప్రాంతం పర్యావరణం అన్నీ కూడా భాగమేనని ఆ సంపద ప్రజల ఆస్తి అని చెప్పారు. కాకినాడలోని చారిత్రాత్మక ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ భూములను, ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తున్నారన్నారు. పూర్వ కట్టడాలను ఆస్తులను కాపాడవలసిన వారే వాటిని అన్యాక్రాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌, పెద్ద మార్కెట్‌, పిఆర్‌ కళాశాల, మెక్లారిన్‌ పాఠశాల, కోస్తా తీర ప్రాంతాలను కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు. కొన్ని ట్రస్టులు ఆయా సంపదకు రక్షణగా నిలుస్తున్నాయని, కానీ ఆ ఆస్తులు కాపాడవలసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాజేంద్ర సింగ్‌ హిందీ ప్రసంగాన్ని పర్యావరణ సామాజికవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తెలుగులోకి అనువదించారు. పిడబ్ల్యూసిడిఎఫ్‌ కో- ఆర్డినేటర్‌ ప్రెసింగి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెఎన్‌టియుకె ప్రొఫెసర్లు డాక్టర్‌ మురళీకష్ణ, డాక్టర్‌ ఆలపాటి శ్రీనివాస్‌, సామాజికవేత్తలు చిక్కాల దొరబాబు, పి.శివశంకర్‌, టికె.విశ్వేశ్వర్‌ రెడ్డి, కె.మృత్యుంజయరావు, ఐ.దోసగిరిరావు, గూడూరు వెంకటేశ్వరరావు, వక్కలంక రామకృష్ణ, చిక్కాల అబ్బు, నందమూరి వినోద్‌, ఉద్దండ రాజ్యలక్ష్మి, జి.సత్యమూర్తి, మల్లాడి రాజు, పప్పు దుర్గా రమేష్‌, ఎండి జవహర్‌ ఆలీ, కిషోర్‌ కుమార్‌, దూసర్లపూడి రమణ రాజు, విబిఎల్‌ఎన్‌.మూర్తి, బివి.రమణమూర్తి, వైదాడి నూక రాజు, కొప్పనాతి శ్రీనివాసరావు, ఆకుల ప్రవీణ్‌, ఎపిజె విను, పోలసపల్లి సరోజ, పెద్దింశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు.

➡️