వెక్కిరిస్తున్న పునాదులు..!

Mar 3,2024 23:17
నవరత్నాలు పేదలందరికీ

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో వైసిపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. అయితే సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, మెటీరియల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వంటి కారణాలతో కాకినాడ జిల్లాలో మూడేళ్ల నుంచి నత్త నడకకు పోటీగా నిర్మాణాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు 33 శాతం కూడా పూర్తి కాలేదు. నిర్మాణాలను ప్రారంభించకపోతే స్థలాలను రద్దు చేస్తామని అధికారుల బెదిరింపులతో కొన్నిచోట్ల అప్పులు చేసి లబ్ధిదారులు హడావిడిగా నిర్మాణాలు చేపట్టారు. అయితే అనేకచోట్ల పునాదులు దశలోనే నిర్మాణాలు నిలిచిపోయాయి.పట్టాలు ఇచ్చారు..స్థలాలు చూపించలేదుసొంత స్థలం లేక ఇల్లు నిర్మించుకోలేని పేదల కోసం ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ప్రత్యేక లేఔట్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రూరల్‌ ప్రాంతానికి చెందిన పేదలకు సెంటున్నర, పట్టణ ప్రాంతాల వారికి సెంటు స్థలం చొప్పున పట్టాలను పంపిణీ చేశారు. నిర్మాణానికి రూ.1.80 లక్షలు కేటాయించారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని చోట్ల ప్రయివేటు స్థలాలను కొనుగోలు చేసి లే అవుట్లను సిద్ధం చేశారు. అయితే భూముల ఎంపికలో క్షేత్రస్థాయిలో చేసిన పొరపాట్ల వలన వాటిల్లో పేదలు ఇళ్ళు నిర్మించుకునేందుకు ఇష్టపడడం లేదు. ఈ పథకంలో భాగంగా 2020 డిసెంబర్‌ నుంచి జిల్లాలో 72,041 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. గత మూడేళ్ళుగా కేవలం 23,804 ఇళ్ళు మాత్రమే ఇప్పటి వరకు పూర్తి అయినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తుని, రౌతులపూడి, ప్రతిపాడు, జగ్గంపేట, పిఠాపురం, గొల్లప్రోలు, కరప, సామర్లకోట, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో లేఔట్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో నిర్మాణాలు చేయడానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. పిఠాపురం, కాకినాడ రూరల్‌, సామర్లకోట, పెద్దాపురం తదితర మండలాల్లో అనేక మందికి ఇంటి పట్టాలు ఇచ్చినప్పటికీ నేటికీ స్థలాలు చూపించిన దాఖలాలు లేవు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాలను చూపించకుండానే హడావుడిగా రిజిస్ట్రేషన్లు ప్రక్రియను చేపట్టింది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ 50 శాతం మందికి రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. ఇంటి స్థలాలను చూపించకుండా రిజిస్ట్రేషన్లు ఏమిటని చాలాచోట్ల సచివాలయ ఉద్యోగులను లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. తమకు తక్షణమే స్థలాలు చూపించాలంటూ ఇటీవల సామర్లకోట మండలం వికె.రాయపురం గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. నేటికీ వారి సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. వివిధ దశల్లోనే కొనసాగుతున్న నిర్మాణాలుజిల్లాలో సుమారు 72 వేల నిర్మాణాలు చేపట్టగా వీటిలో 3,781 నిర్మాణాల ప్రారంభం కాలేదు. 23,804 ఇళ్ళు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వాటిలో 25,863 ఇళ్లకు పునాదులు వరకూ నిర్మించారు. 14,030 ఇళ్లకు పునాదులు పూర్తి అయ్యాయి. 2231 రూప్‌ లెవెల్‌ (స్లాబు వరకూ) పూర్తి కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.63,170 లక్షలు ఖర్చు చేసింది. కాకినాడ రూరల్‌లో 5,850 ఇళ్లకు కేవలం 1251, కోటనందూరు మండలంలో 445 ఇళ్లకు కేవలం 46 మాత్రమే పూర్తి అయ్యాయి. యు.కొత్తపల్లి మండలంలో 2,400 ఇళ్లకు సుమారు 1000 గృహాలు, గొల్లప్రోలు మండలంలో 2390 ఇళ్లకు 921, సామర్లకోట అర్బన్‌లో సుమారు 3 వేల ఇళ్లకు ఇప్పటి వరకు 1438, రౌతులపూడి మండలంలో 327కి 92, పెద్దాపురం అర్బన్‌లో 2441 ఇళ్లకు 871 మాత్రమే పూర్తి అయ్యాయి. ఇలా అన్ని మండలాల్లోనూ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపించడం లేదు. చాలా చోట్ల పునాదులు వరకు నిర్మించి నిలిపివేశారు.సిఎం ప్రారంభించినచోట కానరాని పురోగతికాకినాడ నగరంలోని పేదలకు సుమారు 16 కిలోమీటర్లు దూరంలో ఉన్న యు.కొత్తపల్లి మండలం కొమరగిరి లే అవుట్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. 2020 డిసెంబర్‌ 25న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర వ్యాప్తంగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇక్కడ కాకినాడ నగరవాసులకు 16,138 పట్టాలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కేవలం 1843 ఇళ్ళు మాత్రమే పూర్తి అయ్యాయి. మూడేళ్ళ నుంచి 11 శాతం కూడా నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. మూడు కాంట్రాక్టు సంస్థలకు నిర్మాణ పనులు అప్పగించినా ఇక్కడ పురోగతి కనిపించడం లేదు. ఇలా ఏ మండలంలో ఏ లౌ అవుట్‌ను చూసినా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా దర్శనమిస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.

➡️