శివారుకు సమస్యలెన్నో..!

Feb 27,2024 23:45
ఇరిగేషన్‌

రైతులకు తప్పని సాగు నీటి కష్టాలు
బీడు వారుతున్న పంట పొలాలు
అన్నదాతల గోడు పట్టని అధికారులు
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి
పిఠాపురం మండలం పి.దొంతమూరు, వెల్దుర్తి, రాయవరం, పి.తిమ్మాపురం తదితర గ్రామాలకు చెందిన పలువురు రైతులు, గ్రామ సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు ఇటీవల కిర్లంపూడిలో ఏలేరు ఇరిగేషన్‌ సెక్షన్‌ ఆఫీసు వద్ద ఆందోళన చేపట్టారు. కార్యాలయాన్ని ముట్టడించి సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. అయినా అధికారులు స్పందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ప్రతి ఏటా ఇక్కడి రైతాంగానికి సాగునీటి కష్టాలు తప్పడం లేదు.ఏలేరు ఆయకట్టు కింద శివారు పంట పొలాలకు సాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయి. ఏలేరు ఆధునీకరణ లేకపోవడంతో కాలువలు అధ్వానంగా మారిపోయాయి. దీంతో పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, పెద్దాపురం, సామర్లకోట తదితర ప్రాంతాల శివారు రైతులకు కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. ఈ ఏడాది కూడా రబీ సాగుకి అనేక అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పూర్తిస్థాయిలో సాగు నీరందక వరి పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ప్రధానంగా పలు సాగునీటి కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో ఏలేరు నీటిపై ఆధారపడిన వీరి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. నీరందుతుందనే ఆశతో వరి నాట్లు వేయగా ఇప్పుడు పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం వచ్చి పడింది. గత కొన్ని రోజులుగా చుక్కనీరు రాకపోవడంతో పొలాలు నెర్రవారి చేతిక ిరాకుండా పోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా పరిధిలోని వివిధ సాగునీటి వ్యవస్థల కింద ఈ ఏడాది 1.91 లక్షల ఎకరాల్లో రైతులు రబీ సాగు చేపట్టారు. ఏలేరు ప్రాజెక్టు సాగు నీటి ఆధారంగా జగ్గంపేట, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లోని దాదాపు 53 వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. ప్రస్తుతం పిఠాపురం మండలంలోని కొన్ని గ్రామాల్లో సుమారు 2500 ఎకరాలకు సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎకరాకు ఇప్పటివరకు రూ.15 వేలు నుంచి రూ.18 వేల వరకు పెట్టుబడులు పెట్టగా సాగునీరు లేక పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి వచ్చాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జగ్గంపేట ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో ఈ సమస్యను కాకినాడ ఎంపి వంగా గీత దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణమే సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా అధికారులు కదలిక లేదని రైతులు ఆరోపిస్తున్నారు.ఇతర అవసరాలకు మల్లింపు మళ్లింపుఏలేరు నీటిని సాగు అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తూ ఉండడంతో ఏటా రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఏలేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం సుమారు 11 టిఎంసిల నీటి నిల్వలు ఉన్నాయి. ఇందులో 4.50 టిఎంసిలను విశాఖ నగర త్రాగునీటికి, స్టీల్‌ ప్లాంట్‌ అవసరాల కోసం తరలిస్తున్నారు. అలాగే 4.5 టిఎంసిలు డెడ్‌ స్టోరేజి నిమిత్తం కేటాయించారు. కేవలం 2.31 టిఎంసిలను ఆయకట్టు కింద సాగవుతున్న 53 వేల ఎకరాలకు కేటాయించారు. అయితే సాగునీటి కాలువల ఆధునికరణ ఏళ్ళు తరబడి చేపట్టకపోవడంతో కింద వరకు నీరు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఈ నేపథ్యంలో శివారు రైతాంగం అతివృష్టి, అనావృష్టి పరిస్థితులకు గురై నష్టాలకు లోనవుతున్నారు.తాళ్ళరేవు, కాజులూరు మండలాల్లోనూ నీటి ఎద్దడిఈ రెండు మండలాల్లోనూ సుమారు 1500 ఎకరాల్లో సాగునీటి ఎద్దడి నెలకొందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలు శివారు ఆయకట్టుకు సక్రమంగా అందకపోవడంతో పంటలను నష్టపోవాల్సి వస్తుందని పలు గ్రామాలకు చెందిన రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కాలువలను ఆధునీకరణ చేయించి సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

➡️