సమస్యలను పరిష్కరించకుంటే పోరాటమే

Jan 30,2024 23:09
భవన నిర్మాణ కార్మికుల

ప్రజాశక్తి – కాకినాడ

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటమే శరణ్యమని ఎపి భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు అన్నారు. కాకినాడ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ బుల్లిరాణికి ఈ మేరకు మంగళవారం వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సంఘ కార్యనిర్వహక అధ్యక్షులు చెక్కల రాజ్‌ కుమార్‌, జిల్లా సహాయ కార్యదర్శి మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం భవననిర్మాణ కార్మికులకు ఈ ఐదేళ్ల కాలంలో తీవ్ర అన్యాయం చేసిందని, కార్మికుల దాచుకున్న లేబర్‌ సెస్‌ రూ.2,500 కోట్లను దొడ్డిదారిన తన అవసరాలకు దారి మళ్లించిందన్నారు. కార్మికుల కుటుంబాలకు చెల్లించాల్సిన ప్రసూతి సాయం, వివాహ బహుమతులు, సహజ మరణం, ప్రమాద మరణాల పరిహారాలను చెల్లించకుండా అన్ని పథకాలను 1214 మెమో ద్వారా సిఎం నిలు పుదల చేయించారని విమర్శంచారు. కార్మికశాఖ అధికారులకు, సచివాలయ సిబ్బందికి, అధికార పార్టీ ఎంఎల్‌ఎలు, రాష్ట్ర మంత్రుల దృష్టికి కార్మికుల సమస్యలను తీసుకెళ్లినా చలనం లేకుండా పోయిందన్నారు. నవరత్నాల పేరుతో 10 మందికి పథకాలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుం బాలను రోడ్డున పడేసిందన్నారు. ఫిబ్రవరిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కార్మికులందరూ పోరాటానికి సిద్ధపడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, కాకినాడ రూరల్‌ మండల నాయకులు టి.రాజా పాల్గొన్నారు.

➡️