సర్కారు బాధితులే స్టార్‌ క్యాంపెయినర్లు

Jan 29,2024 22:07
వైసిపి ప్రభుత్వం వల్ల

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి

వైసిపి ప్రభుత్వం వల్ల నష్టపోయిన బాధితులందరూ తమకు స్టార్‌ క్యాంపెయినర్లే అని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ కాతేరులో సోమవారం ‘రా.. కదిలిరా..’ సభను మాజీ మంత్రి కెఎస్‌.జవహర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఓటు అనే వజ్రాయుధంతో అరాచక పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలుగు తమ్ముళ్లతో రాజమహేంద్రవరం దద్దరిల్లిందన్నారు. త్వరలో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయన్నారు. టిడిపి-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కందుకూరి వీరేశలింగం పుట్టిన గడ్డ ఇది అని, అక్కడ నుంచే ఆయన సంఘసంస్కరణు ప్రారంభించారన్నారు. రానున్న ఎన్నికల్లో అరాచక ప్రభుత్వాన్ని అటకెక్కించాలన్నారు. ఇక్కడున్న రాజమహేంద్రవరం ఎంపీ రీల్స్‌ మాస్టర్‌ అన్నారు. పార్లమెంటులో మాట్లాడింది లేదని, సోషల్‌ మీడియాలో మాత్రం రీల్స్‌ పెడుతూనే ఉంటారని ఎద్దేవా చేశారు. అడిగి మరీ ‘గుడ్‌ మార్నింగ్‌’ చెప్పించుకుంటాడు, పూలు చల్లించుకుంటాడని విమర్శించారు. ‘నీ రీల్స్‌ చూసి అలిసిపోయామని ఒక తన్ను తన్ని ఎంఎల్‌ఎగా పోటీ చేయమన్నారు’ అని గుర్తు చేశారు. ఆవ భూముల కుంభకోణంలో ఎంపీ వాటా రూ.150 కోట్లు పైమాటేనని ఆరోపించారు. అనపర్తి ఎంఎల్‌ఎకి మరోపేరు గ్రావెల్‌ రెడ్డి అన్నారు. ఆయన సతీమణి సైతం అదే పనిలో ఉన్నారన్నారు. రూ.కోట్లు కొల్లగొట్టారని తెలిపారు. రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా బ్లేడ్‌ బ్యాచ్‌కు లీడర్‌ అన్నారు. పేదల ఇళ్ల స్థలాలు కొట్టేయడమే కాకుండా, కొండలు కరిగించేస్తున్న మహానాయకుడు అన్నారు. ఆయన భోజనమే ఇసుక, గ్రావెల్‌ అని అన్నారు. కొవ్వూరుకు చెందిన మంత్రిని గోపాలపురానికి తరిమేశారన్నారు. మరో ఎంఎల్‌ఎ తలారి అవినీతికి కేరాఫ్‌ అన్నారు. అక్కడ చెత్త ఇక్కడికి ఇక్కడ చెత్త అక్కడికి వేస్తే గెలుస్తారా? అని ప్రశ్నించారు. చిన్నతనంలో తాను ఊల్లే చూసే కనికట్టు ఆటలకు లేటెస్ట్‌ వెర్షనే ఈ జగన్మాయ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్‌గా తయారు చేస్తామన్నారు. ధాన్యం రైతులను, ఆక్వా రైతులను ఆదుకుంటామని తెలిపారు. రోడ్లు బాగు చేస్తామని, ఉచిత ఇసుక తెస్తామని, పంట కాలువలను ఆధునికీకరిస్తామని తెలిపారు. అన్న దాతల సంక్షేమం కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం జీవనాడి పోలవరం కోసం, గంజాయి లేని సమాజం కోసం, బడుగుల ఆత్మగౌరవం కోసం, రాతియుగం పోవాలి-స్వర్ణయుగం రావాలి అన్నారు. టిడిపి-జనసేన ఐక్యత వర్ధిల్లాలి అని పిలుపు నిచ్చారు. ఐదేళ్ల వైసిపి పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైందన్నారు. వ్యవసాయశాఖను మూసేశారని, ఇరిగేషన్‌ శాఖను నిర్వీర్యం చేశారని విమర్శించారు. నేడు ధాన్యం కొనే దిక్కు కూడా లేదన్నారు. త్వరలో రైతు రాజ్యం వస్తుందన్నారు. టిడిపి హయాంలో 72 శాతం పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తే వైసిపి ప్రభుత్వం దాన్ని నాశనం చేసిందన్నారు. కరెంటు చార్జీలు 9 సార్లు పెంచి ప్రజలపైన రూ.56 వేల కోట్ల భారం వేశారన్నారు. తమ ప్రభుత్వం వస్తే కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చే బాధ్యతను తీసుకుంటామన్నారు. వైసిపి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందన్నారు. ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదొక మూల దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. డ్రైవర్‌ ను చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎంఎల్‌సిని పక్కన పెట్టుకుని ఈ ముఖ్యమంత్రి ఊరేగుతున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పక్షపాతి అంటూ ప్రగల్భాలు పలుకుతూ దళితులకు మేలు చేకూర్చే 26 పథకాలను రద్దు చేసిన ఘనత జగన్‌ సర్కారుకే దక్కుతుందన్నారు. దీన్ని బట్టే దళితులంటే వైసిపి ప్రభుత్వానికి ఎంత ప్రాధన్యత ఉందో అవగతం అవుతుందన్నారు. సబ్‌ ప్లాన్‌ నిధులను సైతం దారి మళ్లించి దళిత కాలనీల అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. తొలుత ఎన్‌టిఆర్‌ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌, రూరల్‌ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టిడిపి అర్బన్‌ నాయకులు ఆదిరెడ్డి వాసు తదితరులు మాట్లాడారు. కడియం మండలానికి చెందిన సర్పంచ్‌ అన్నందేవుల చంటి చంద్రబాబుకు వరి కంకులు, నాగలి అందించారు. ఈ సభలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎంఎల్‌ఎలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వనమాడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️