సానుభూతి కలిసొచ్చేనా..?

Feb 28,2024 23:45
మూడు పార్టీల నుంచి వరుసగా

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

మూడు పార్టీల నుంచి వరుసగా హ్యాట్రిక్‌ ఓటమిని చవిచూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌ మరోసారి కాకినాడ పార్లమెంటు బరిలో నిలిచి పోటీకి సై అంటున్నారు. 4వసారి పోటీ చేస్తున్న ఆయన సానుభూతి ఓట్లపైనే పూర్తిగా ఆధారపడ్డారని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ మేరకు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గత పది రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇప్పటికే వైసిపి అధిష్టానం ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ఈ మేరకు గెలుపే లక్ష్యంగా సునీల్‌ వివిధ కార్యక్రమాలను చేపట్టారు. రెండు నెలల క్రితం కాకినాడ కేంద్రంగా మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. పెద్ద ఎత్తున యువత హాజరయ్యేలా విస్తృతంగా ప్రచారం చేశారు. వేల మందికి వివిధ ప్రయివేటు కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ప్రయత్నం చేశారు. ఇలా మళ్లీ సునీల్‌ కోసం చర్చించుకునేలా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తాజాగా వచ్చే నెల 4న తన పుట్టిన రోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని జెఎన్‌టియు ఎదురుగా ఒక ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఏదో ఒక కార్యక్రమం ద్వారా జనం లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ముఖ్యమైన కార్యకర్తలను ఆయన కలుసుకు న్నారు. సిట్టింగ్‌ ఎంఎల్‌ఎలతో సమావేశాలు నిర్వహించారు. వైసిపి ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు. వాలంటీర్లకు సన్మానాలు చేస్తూ నగదు, ఇతర బహుమతులు కూడా అందజేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిని ఓడించి ఎలాగైనా గెలుపొందాలని ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.మూడు సార్లూ పరాజయమేచలమలశెట్టి సునీల్‌ వరుసగా మూడుసార్లు పార్లమెంట్‌ బరిలో దిగి మూడు ఎన్నికల్లోనూ మూడు పార్టీల తరుపునా పరాజయం పాలయ్యారు. ఆయన అనుసరించిన తప్పిదాలతో పార్లమెంట్‌ లో అడుగుపెట్టే అవకాశాన్ని చేజార్చుకున్నారు. జర్మనీలో పారిశ్రామికవేత్తగా ఉన్న సునీల్‌ 2009లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి ఎన్నికల్లో తొలిసారిగా ప్రజారాజ్యం తరుపున పోటీ చేశారు. అప్పట్లో టిడిపి తరుపున రంగంలో దిగుతారని భావించినా చివరకు చిరంజీవి పార్టీలో చేరారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైసిపి నుంచి రెండోసారి కూడా పోటీ చేసినా ఓటమి తప్పలేదు. అప్పుడు అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొంతకాలానికి వైసిపికి దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో వైసిపిని వీడి టిడిపిలో చేరి బరిలో దిగినప్పటికీ మూడోసారి కూడా ఓటమి తప్పలేదు. ఇప్పుడు టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సానా సతీష్‌ పోటీలో ఉండే అవకాశం ఉంది. కాకినాడ పార్లమెంటు సీటుని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. సానా సతీష్‌ ఆ పార్టీలో చేరి బరిలో ఉంటారని సమాచారం. సునీల్‌కు సతీష్‌ బాబు శిష్యుడు. ఇప్పుడు పార్లమెంట్‌ పోటీలో గురు శిష్యులు ఇద్దరూ పోటీపడే అవకాశం కనిపిస్తుంది. వరుసగా మూడుసార్లు ఓటమి చవి చూసిన సునీల్‌ కు ఈసారి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపికి తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సానుభూతి కలిసొస్తుందనే అంశంపైనే సునీల్‌ దృష్టి సారించారని విశ్లేషకులు భావిస్తున్నారు.

➡️