హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

Jan 26,2024 23:58
హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి42 రోజులు జరిగిన అంగన్వాడీల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణం ఆదేశాలు జారీ చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి డిమాండ్‌ చేశారు. డిసెంబరు 12న మొదలైన అంగన్వాడీల సమ్మె జనవరి 22 అర్ధరాత్రితో ముగిసిందని, దానర్థం పోరాటం ముగిసినట్టు కాదని తాత్కాలిక విరామమేనని తెలిపారు. సమ్మె విజయవంతానికి సహకరించిన ప్రజా సంఘాలు, కార్మిక, మహిళా సంఘాలకు, రాజకీయ పార్టీలకు, అంగన్వాడీల లబ్ధిదారులకు, రాష్ట్ర ప్రజానీకానికి, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక కచేరిపేట సిఐటియు యూనియన్‌ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జి.బేబిరాణి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దడాల పద్మ, ఇ.చంద్రావతితో కలిసి మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఫైనాన్స్‌ సెక్రటరీ, స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారుల సంతకాలతో రాతపూర్వకంగా ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. సమ్మె కాలం వేతనాలు చెల్లించేలాగా, సమ్మెలో నాయకులపై, అంగన్వాడీలపై పెట్టిన కేసులు ఎత్తివేసేలా, తొలగించిన వారందరినీ బేషరతుగా విధుల్లోకి తీసుకునేలా అంగీకరించిన తరువాతే విరమించినట్లు మీడియాకు తెలిపారు. యూనియన్‌ ఇచ్చిన చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ 11లో 9 డిమాండ్లపై నిర్ధిష్టంగా ఆదేశాలు ఇస్తామని ప్రభుత్వం అంగీకరించిందన్నారు. గ్రాడ్యుటీ కేంద్రానికి నివేదించి, జులైలో యూనియన్‌ నాయకులతో చర్చించి ఉభయులు అంగీకారం మేరకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని చర్చల వివరాలను తెలిపారు. ఈ 42 రోజుల సమ్మె కాలంలో అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు, టెర్మినేషన్‌ లేటర్లు, ఎస్మా ప్రయోగించినా, అబద్ధపు ప్రచారాలతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసినా, చట్టబద్ధమైన సమ్మెకు రాజకీయరంగు పూలమాలని ప్రయత్నించినా మొక్కవోని దీక్షతో అంగన్వాడీలు ఐక్యంగా పోరాడి జగన్‌ ప్రభుత్వ మెడలు వంచి విజయం సాధించారన్నారు. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు బాలం లక్ష్మీ, జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ రాజేశ్వరి, నాగమణి, ఎస్తేరు రాణి, బుల్లెమ్మ, మేరీ సమాధానం, లక్ష్మీ, వీరవేణి, చామంతి, నీరజ తదితరులు పాల్గొన్నారు.

➡️