11న కలెక్టరేట్‌ వద్ద గోపాలమిత్రల ధర్నా

Mar 6,2024 23:44
గోపాల మిత్ర లకు ఉద్యోగ భద్రత కల్పిం చాలనే

ప్రజాశక్తి – కాకినాడ

గోపాల మిత్ర లకు ఉద్యోగ భద్రత కల్పిం చాలనే డిమాండ్‌తో ఈ నెల 11న కలెక్టరేట్‌ వద్ద ధర్నాను నిర్వహిస్తున్నట్లు గోపాలమిత్ర సర్వీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌.రాజు తెలిపారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు సేవలు అందిస్తున్న గోపాలమిత్రకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. కష్టపడి రైతులకు సేవలందిస్తున్న కనీస వేతనం దక్కడం లేదన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ 2019 నుంచి ఎఐ ఇన్సెంటివ్స్‌ చెల్లించడాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని తెలిపారు. తెలంగాణాలో రూ.10వేలు చెల్లిస్తుంటే, మన రాష్ట్రంలో రూ.6500 వేతనాన్ని మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. చాలీచాలనీ వేతనంతో కుటుంబాన్ని ఏవిధంగా సాకాలని నిలదీశారు. ఖాళీగా ఉన్న 6 వేల యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌ పోస్టుల్లో గోపాల మిత్రలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పైడిమాండ్ల సాధన కోసం మార్చి 11 కాకినాడ కలక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాకి గోపాలమిత్రలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ నాయకులు పి.అబ్బులు, టి.శ్రీనివాస్‌, బి.అప్పలరాజు పాల్గొన్నారు.

➡️