14న రైతాంగ చలో ఢిల్లీ జయప్రదం చేయండి

Mar 9,2024 23:25
ఈ నెల 14న నిర్వహిస్తున్న రైతాంగ చలో ఢిల్లీ

ప్రజాశక్తి – కాకినాడ

ఈ నెల 14న నిర్వహిస్తున్న రైతాంగ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. స్థానిక కచేరి పేటలో సిఐటియు జిల్లా కార్యాలయంలో శనివారం ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.వెంక టేశ్వర్లు అధ్యక్షతన చలో ఢిల్లీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లు రాజబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ మాట్లాడారు. పరిశ్రమల్లో తయారయ్యే సరుకులకు ఎంఆర్‌పి ఎలా అయితే ఉంటుందో రైతులు పండించే పంటలకు మద్దతు ధర కచ్చితంగా చెల్లించేలా చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రైతాంగం ఉద్యమం, రైతుల కష్టా లపై బిజెపి పరివారం అవహేళనచేస్తూ సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారాన్ని సాగిస్తున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా కనీసం మద్దతు ధర చట్టం చేస్తే రూ.20 వేల కోట్లు మాత్రమే అవుతుందని, ఇది ప్రధాని మోడీ కోసం నిర్మించిన గృహానికైన ఖర్చుతో సమానమన్నారు. ఈ పదేళ్ల కాలంలో వ్యవసాయం గిట్టుబాటు కాక, అప్పులపాలై 1 లక్షా 60 వేల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి మోడీ ప్రభుత్వం చేసిన హత్యలేనని మండిపడ్డారు. మధ్య దళారి లాభాలను కాపాడటం కోసం, కార్పొరేట్లకు రూ.45 లక్షల కోట్లు విలువచేసే వ్యవసాయాన్ని అప్పగించడం కోసం రైతుల సమస్యలు పరిష్కరించడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికి 70 శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయమేనని అన్నారు. తక్షణం రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు చెక్కల రాజకుమార్‌, తోకల ప్రసాద్‌, అంజిబాబు, వల్లూరి రాజబాబు, తిరుమల శెట్టి నాగేశ్వరరావు, తాళ్లూరి రాజు, జ్యోతి, చంద్రమళ్ల పద్మ, రొంగల ఈశ్వరరావు, దుంపల ప్రసాద్‌, మలకా రమణ, తదితరులు పాల్గొన్నారు.

➡️