4వ రోజుకు చేరిన పెన్షనర్ల దీక్షలు

Feb 8,2024 23:02
స్థానిక ఇపిఎఫ్‌ కార్యాలయం

ప్రజాశక్తి – కాకినాడ

స్థానిక ఇపిఎఫ్‌ కార్యాలయం వద్ద జరుగుతున్న పెన్షనర్ల రిలే నిరహరనాదీక్షలు గురువారం నాటికి 4వ రోజుకు చేరుకున్నాయి. పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి సిహెచ్‌.సత్యనారాయణ రాజు, ఆలిండియా పోస్టల్‌ రిటైర్డ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి తురగా సూర్యారావు గురువారం జరిగిన దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెన్షనర్ల సమస్యల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఉద్యోగులకు 8వ పిఆర్‌సి ప్రకటించకుండా కుంటి సాకులు చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా ఇపిఎఫ్‌ పెన్షనర్లు అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, వైసిపిలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు, జిల్లా సహాధ్యక్షులు జోగ అప్పారావు, జిల్లా కార్యదర్శి యుఎస్‌ఎన్‌.రెడ్డి, పి.రమణ, బి.అశోక్‌, కె.పట్టాభి రామారావు, ఆర్‌.నందకిషోర్‌, ఎం.నాగమణి జి.మంగయమ్మ, కె.అప్పలనరసింహ, సూరిశెట్టి సత్యవతి తదతరులు పాల్గొన్నారు.

➡️