కౌలు రైతులపై చిన్న చూపు

May 23,2024 22:30
రబీ పూర్తి కావస్తోంది.

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

రబీ పూర్తి కావస్తోంది. ఖరీఫ్‌కు సన్నద్ధతపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులకు మళ్లీ పంట సాగు హక్కు పత్రాలు అంటే సిసిఆర్‌ (క్రాప్‌ కల్టీవేసన్‌ రైట్స్‌) ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం కౌలు రైతుల పట్ల ప్రతిసారీ నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తోంది. అధికారులు సైతం అదే పంథాను అనుసరిస్తున్నారు. ఈ సారైనా కౌలు రైతులకు న్యాయం జరిగేలా సిసి ఆర్‌ కార్డులను పూర్తిస్థాయిలో ఇస్తారా? లేదా? అనే ప్రశ్నలు వ్యక్తం అవు తున్నాయి. అతి తక్కువ మందికి మాత్రమే సాగు హక్కు పత్రాలు అందుతుండడంతో ప్రభుత్వం ఇస్తున్న రుణాలు నామమాత్రంగానే ఉంటున్నాయి. సిసిఆర్‌ కార్డులు లేక రైతు భరోసా, పంట నష్ట పరి హారం, పంట రుణాలు, పంటల బీమా వంటి పథకాలను కోల్పోతున్నా రు. ఈ నేపథ్యంలో కౌలు రైతులు అప్పులు చేసి పంటలను సాగు చేస్తు న్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నప్పుడు తీవ్ర నష్టాలకు గురై చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాకినాడ జిల్లాలో పంటలను సాగు చేస్తున్న వారిలో 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. అంటే జిల్లాలో సుమారు 1.50 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. 2019లో ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టంతో వీరికి అన్యాయం జరుగుతోంది. సిసిఆర్‌ కార్డు ఉంటేనే ప్రభుత్వం పథకాలు ఇస్తామని చెబుతోంది. ఈ కార్డు ఇవ్వాలంటే భూ యాజమాని సంతకం తప్పనిసరి చేసింది. అనేక చోట్ల యజమానులు అందుకు ఒప్పుకోవడం లేదు. ఫలితంగా జిల్లాలో వేలాదిమంది కౌలు రైతులకు అన్యాయం జరుగుతోంది. 2023-24లో 54 వేల మందికి సిసిఆర్‌ కార్డులు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా తీసుకున్నారు. 56,322 మందికి ఇచ్చామని చెప్పుకొస్తున్నారు. మొత్తం కౌలు రైతుల్లో కేవలం 37 శాతం మందికి మాత్రమే సిసిఆర్‌ కార్డులు ఇవ్వగలిగారు. ఇంకా 63 శాతం మందికి అంటే ఇంకా 94 వేల మందికి కార్డులు ఇవ్వలేదు. లక్ష్యాన్ని నిర్ధేశించడంలో అధికారులు ఏటా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తుండడం కౌలు రైతులకు శాపంగా మారింది. దీంతో ప్రభుత్వ పరంగా అందుతున్న పథకాలు వాస్తవ సాగుదారుల కంటే భూ యజమానులకే అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేకమంది ఏటా పెట్టుబడులు కోల్పోయి నష్టాలకు గురవుతున్నారు. పంటలకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. చివరకు కుటుంబ పోషణకు సైతం అవస్థలు తప్పడం లేదు. నివాసం ఉంటున్న ఇంటిని తాకట్టు పెడుతున్నారు. అప్పులు తీరకపోవడంతో మనస్తాపానికి గురై పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. గతేడాది కాకినాడ జిల్లాలో రెండు నెలల వ్యవధిలోనే ఐదుగురు కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలా ప్రభుత్వ నిబంధనలు ఒకపక్క, అధికారుల నిర్లక్ష్య ధోరణి మరోవైపు కౌలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ప్రభుత్వం ద్వారా అందాల్సిన పథకాలు అందకుండా చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు పూర్తిస్థాయిలో సిసిఆర్‌ కార్డులను జారీ చేసి ప్రభుత్వ అందిస్తున్న పథకాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

➡️