ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ట బందోబస్తు

May 23,2024 22:34
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు

ప్రజాశక్తి – కాకినాడ

ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్టంగా బందోబస్తు నిర్వహించాలని, కౌంటింగ్‌ రోజున ప్రణాళిక ప్రకారం ట్రాఫిక్‌ నియంత్రణ చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జెసి ఎన్‌.రామ్‌సుందర ్‌రెడ్డి, ఎస్‌పి ఎన్‌.సతీశ్‌కుమార్‌, వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, పోలీస్‌, ట్రాఫిక్‌, రోడ్డు భవనాల శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జూన్‌ 4న జెఎన్‌టియులో నిర్వహించే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో చేపట్టాల్సిన బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ, బారికేడ్లు, పబ్లిక్‌ అడ్రెసింగ్‌ సిస్టం, డిస్‌ ప్లే బోర్డులు, అభ్యర్థులు, ఏజేంట్లు వాహనాల పార్కింగ్‌, జిల్లాలో లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్‌ రోజున ప్రణాళిక ప్రకారం ట్రాఫిక్‌ నియంత్రణ చేపట్టాలన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ సమస్యల తలెత్తకుండా పగడ్బందీగా 144 సెక్షన్‌ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ కేంద్రాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌ నియంత్రణకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఎస్‌పి ఎస్‌.సతీశ్‌కుమార్‌ తెలిపారు. జెఎన్‌టియులో తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ పట్టణం, జగ్గంపేట నియోజక వర్గాలకు సంబంధించి అభ్యర్థులు, ఏజెంట్లు వాహనాల పార్కింగ్‌ నిమిత్తం జెఎన్‌టియుకెకి ఎదురుగా ఉన్న ఐటీఐ, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లోను, పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక జిల్లా క్రీడామైదానంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. భద్రత సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పాస్‌లు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని ఆయన తెలిపారు. ట్రాఫిక్‌ నియంత్రణకు సంబంధించి ఆయా కూడళ్లలో డిస్‌ ప్లే బోర్డులు, మైక్‌ అనౌన్స్మెంట్‌ ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ పట్టణంలో కౌంటింగ్‌ రోజున ట్రాఫిక్‌ మళ్లింపుకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌, బందోబస్తు వివరాలు, బారికేడ్ల ఏర్పాటు వంటి అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఆయన కలెక్టర్‌కు వివరించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ డాక్టర్‌ డి.తిప్పేనాయక్‌, వివిధ నియోజకవర్గాలకు చెందిన ఆర్‌ఒలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️