జగ్గంపేటలో ఆశా వర్కర్లు ధర్నా

Feb 9,2024 13:19 #Kakinada
asha workers protest in jaggam peta

ప్రజాశక్తి – జగ్గంపేట : మండల కేంద్రమైన జగ్గంపేటలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం అవరణలో శుక్రవారం ఆశా వర్కర్లు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు సిహెచ్ మంగ మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్న ఆశా వర్కర్స్ ను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని, ఇతర సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆశా వర్కర్స్ కనీస వేతనం చెల్లించాలని, సిహెచ్ సి వర్కర్స్ ను ఆశాలుగా మార్పు చేయాలని, ప్రభుత్వ సెలవు లు, మెడికల్ లీవ్ వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ అమలు చేయాలని , ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, తదితర డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ గురువారం చలో విజయవాడకు పిలుపు ఇవ్వడం జరిగిందని అక్కడకు వెళ్లనివ్వకుండా గృహ నిర్భందాలు చేశారనీ వారు ఆరోపించారు. తొలుత తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట, కాట్రావులపల్లి గ్రామాల యూనియన్ నాయకులు టి. మారమ్మ, సిహెచ్ సత్యవతి, జ్యోతి, చిన్నారి, నీలవేణి, అప్పలకోండ, రమణమ్మ, ఆదిలక్ష్మి, తదితరులు ఉన్నారు.

➡️