4న దేశ వ్యాప్త విద్యాసంస్థల బంద్ పోస్టర్ విడుదల

Jul 1,2024 16:35 #Kakinada

ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్

ప్రజాశక్తి-కాకినాడ : జూలై 4న దేశ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయాలని కోరుతూ కచేరి పేట సుందరయ్య భవన్ లో విద్యార్థి సంఘాల నాయకులు పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ, పిడిఎస్ యు, పిడిఎస్ యు (వి) ఏఐఎస్ఎఫ్ విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఎ) జాతీయస్థాయి పరీక్షలను నిర్వహించడంలో విఫలమైందని, తీవ్రమైన అవకతవకలు, వ్యత్యాశాలతో, భాద్యతారాహిత్యంతో పరీక్షలు నిర్వహించారన్నారు. నీట్ పరీక్షా లీకేజీ తెరవెనుక కుంభకోణం, నీట్ పిజి పరీక్షను 12గంటల మందు వాయిదా వేయడం, యూజిసి నెట్ పరీక్ష రద్దు చేయడం వంటివి విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. నీట్ స్కామ్ పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్య మాత్రమే కాకుండా పాఠశాల విద్యా పరిస్థితి కూడా దారుణంగా తయారుచేశారన్నారు. బిజెపి పాలనలో విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో కోత, ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గించేశారన్నారు. 2018-19, 2021-22 మధ్య దేశంలో 61885 పాఠశాలలు మూసివేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేశారన్నారు. దేశంలో విద్య, ప్రజాస్వామ్యం పై దాడికి వ్యతిరేకంగా జులై4వ తేదీన దేశ వ్యాప్తంగా కెజి నుండి పిజి వరకూ విద్యాసంస్థల బంద్ ఐక్య విద్యార్ధి సంఘాలు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ బంద్ లో అన్ని విద్యా సంస్థలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఎన్డీఎ వ్యవస్థను రద్దు చేయాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఇటీవల నెట్, నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలనీ, పీహెచ్ డి అడ్మిషన్లు కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలనీ, ముంబై ఐఐటి నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్ధి సంఘ నేతలపై అక్రమ కేసులు, నిర్భందాలు యూనివర్సిటీలో ప్రజాస్వామ్యాన్ని అణిచివేత చర్యలు ఆపాలని, దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేతను ఆపాలని, నీట్ పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు, పి డి ఎస్ యు రాష్ట్ర సహయ కార్యదర్శి బి.సిద్దు, పిడిఎస్ యు(వి) జిల్లా కార్యదర్శి సతీష్, విద్యార్థి జేఏసీ నాయకులు బుల్లి రాజు, ఏఐఎస్ఎఫ్ నాయకులు స్టాలిన్, ఎస్ ఎఫ్ ఐ కాకినాడ నగర అధ్యక్ష,కార్యదర్శిలు సంజాయి, వాసుదేవ్ పి డి ఎస్ యు(వి) జిల్లా నాయకులు శ్రీకాంత్, పిడిఎస్ యు నాయకులు నవీన్, మూర్తి, చిన్న తదితరులు పాల్గొన్నారు.

➡️