భానుడి భగభగలు

Apr 17,2024 22:47
సామర్లకోట మండలం,

ప్రజాశక్తి – సామర్లకోట

సామర్లకోట మండలం, పట్టణ పరిధిలో భానుడి భగభగలతో ఎండలు మండుతున్నాయి. అంతకంతకు పెరుగుతున్న ఎండల వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. అధికంగా ఎండ వేడి, ఉక్కపోత ఉండడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మరోవైపు వేడిగాలులు వీస్తుండడంతో ఉక్కిరిబిక్కి రవుతున్నారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రాలేక పోతున్నారు. 10 గంటల తర్వాత ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్కెట్లు వెలవెలబోతున్నాయి. కర్ఫ్యూ విధించినట్లుగా రహదారులన్నీ కన్పిస్తున్నాయి. ఎండవేడిమికి వృత్తిదారులు తమ పనులు చేయలేకపోతున్నారు. ఉపాధి వేతనదారులు, భవన నిర్మాణ కార్మికులు, శ్రామికులు, ఫుట్‌పాత్‌ వ్యాపారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోతున్నారు. ప్రయాణికులు, వాహన దారులు కూడా రాకపోకలు సాగించలేకపోతున్నారు. వివిధ పనుల నిమిత్తం బయ టకు వచ్చేవారు సైతం ఉదయం 10 నుంచి 11 గంటల్లోపు పనుల ను చూసుకుని ఇంటి బాట పడుతున్నారు. ప్రస్తుతం శుభకార్యాలు అధికంగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరికొందరు ప్రయాణాలు సాగిస్తున్నారు. మే నెల రాకుండానే 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. మే నెలలో పరిస్థితేమిటో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. .ఇదిలా ఉండగా వడగాల్పులు వీస్తున్నట్టు ఎపి విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఎండ తీవ్రత జూన్‌ వరకు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. మొబైల్‌ ద్వారా పలు సూచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరికొద్దిరోజులపాటు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. ఎండల వేడిమి తాళలేక బాటసారులు శీతల పానీయాలు, పలు రకాల పండ్ల జ్యూసులు, చెరుకు రసం బండ్లు, ఆశ్రయించి సేద తీరుతున్నారు. బాటసారి వేసవి దాహం తీర్చడానికి గతంలో ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా చలివేంద్రాలను ఏర్పాటు చేసేవారు. ప్రస్తుత సీజన్లో దాతలు ముందుకు వచ్చిన చోట మాత్రమే కొద్దిగా చలివేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. ప్రభుత్వం కూడా స్పందించి ప్రధాన కోడలు విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాటసారుల దాహార్తి తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

➡️